ఆంధ్ర చంద్రబాబు కంటే ఆంధ్ర చినజీయర్ తో ఎక్కువ ప్రమాదం

తెలంగాణకు ఆంధ్ర చంద్రబాబు కంటే ఆంధ్ర చినజీయర్ స్వామితోనే ఎక్కువ ప్రమాదముందని బహుజన మేధావి, టి-మాస్ తెలంగాణ ఛెయిర్మన్  ప్రొఫెసర్ కంచె ఐలయ్య షఫర్డ్  అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణకు  ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడితో ఎక్కువ ప్రమాదముందని ప్రచారం చేయడం మీద స్పందిస్తూ ఫ్రొ ఐలయ్య ఇలా వ్యాఖ్యానించారు.  తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసియార్ ఆంధ్ర ప్రాంతపు పెద్ద ప్రాంతీయ వాది అయిన చినజీయర్ స్వామి చెప్పిన లేదా అంగీకరించిన నిర్ణయాలు మాత్రమే తీసుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు.

ఈ ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు కూడా  కెసియార్ చిన్నజీయర్ స్వామి కాళ్లకు సాష్టాంగ దండం పెట్టి మొదలు పెట్టాడు. ఆయనను ముఖ్యమంత్రి సీటులో ముందు కూర్చొబెట్టి తరువాత తాను కూర్చున్నాడు. చిన్న జీయర్ స్వామి రాష్ట్రాల నీళ్ల పంపకం విషయంలో పూర్తిగా శాసిస్తున్నాడు. ఆయన చెప్పినందువల్లే తెలంగాణ గుడులకు కాకుండా ఆంధ్రా గుడులకు కోట్లాది రూపాయలు ఇచ్చి వచ్చాడు. ఆయన చేతనే అన్ని పేర్లు పెట్టిస్తున్నాడు. యాదగిరి గుట్ట పేరును కూడా ఆయనే మార్చాడు.’ అని ప్రొఫెసర్ ఐలయ్య అన్నారు.

 తెలంగాణలో  ప్రభుత్వం నడిపేది చిన్న జీయర్ స్వామియే ఆయన వ్యాఖ్యానించారు.  ‘కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చిన్న జీయర్ స్వామి మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఈ  ఎన్నికల తర్వాత చంద్రశేఖర్ రావు తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా ఆంధ్రా పెత్తనం తగ్గుతుంది తప్ప పెరుగదు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పీఠాధిపతులు రాష్ట్రాలను, దేశాలను ఎలా నడుపుతున్నారో మనం చూశాం. చినజీయర్ స్వామి తెలంగాణ డీఫ్యాక్టో ముఖ్యమంత్రి. ఆయన తెలంగాణ యోగీ ఆదిత్యానాథ్. తెలంగాణ రాష్ట్రాన్ని మూఢనమ్మకాల్లో ముంచి ఆగం చేయాలనే ఆలోచన జరిగింది. అదే అమలవుతుంది,’ అని ఐలయ్య అన్నారు.

ఏ రాజకీయ నాయకుడు కూడా చీకటి రాజ్యం నడుపలేడని చెబుతూ  తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ను ఓడించడమంటే చినజీయర్ స్వామిని ఓడించమని టి-మాస్ భావిస్తున్నదని అన్నారు.

‘చంద్రబాబు నాయుడు ఏవిధంగా కూడా  తెలంగాణకు జీయర్ స్వామి చేసేంత నష్టాన్ని చేయలేదు. ఈ ఎన్నికలు టిఆర్ఎస్-చన్ని జీయర్ స్వామికి తెలంగాణ ప్రజలకు మధ్య  జరుగుతున్న ఎన్నికలుగా చూడాలని టి-మాస్ ప్రజలను కోరుతోంది.

‘కేసీఆర్ కేవలం ఆయన కాళ్లు మొక్కే  బొమ్మ మాత్రమే. ఆంధ్ర స్వామి కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన తెలంగాణను ఈ ఎన్నికల్లో విముక్తి చేయాలని ప్రజలను కోరుతున్నాం. తెలంగాణ ఆత్మ గౌరవం ఆంధ్రకు కెసిఆర్ తాకట్టు పెట్టినంత చరిత్రలో ఏ నాయకుడు పెట్టలేదూ. ఇవి ఆత్మగౌరవ పోరాట ఎన్నికలు. కనుక కెసిఆర్ ను ఓడించండి,’ అని ప్రొఫెసర్ ఐలయ్య పిలుపునిచ్చారు.