ఆ ఆరుగురు సీనియర్ నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్…కారణం ఇదే

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆరుగురు సీనియర్ నేతలకు సీరియస్ గా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో సదరు నేతల బలాలు, బలహీనతలు గురించి వివరించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు జగన్. కొందరు నేతలకు, తీరు మార్చుకోకపోతే సీటు వేరే వారికి ఇవ్వాల్సొస్తుంది అని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇంతకీ ఆ ఆరుగురు సీనియర్ నేతలు ఎవరో, జగన్ వారితో ఏయే అంశాలపై చర్చించారో పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.

జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే, ఖాళీ దొరికినప్పుడు పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో, నియోజకవర్గాల ఇంచార్జిలతో బలాలు, బలహీనతలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో కొనసాగింది. కాగా జగన్ గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలోని 7 నియోజవర్గాల ఇంచార్జిలు, సిట్టింగ్ లను చీపురుపల్లికి పిలిపించారు.

వియజయనగరం జిల్లా ఇంచార్జి బొత్స సత్యనారాయణ, సర్వే బృందాల సమక్షంలో నరసరావుపేట నేతలతో రివ్యూ జరిపారు. ఈ సమీక్షలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి ఇంచార్జి అంబటి రాంబాబు, వినుకొండ ఇంచార్జి బొల్లా బ్రహ్మ నాయుడు, గురజాల ఇంచార్జి కాసు మహేష్ రెడ్డి, పెదకూరపాడు ఇంచార్జి కావటి మనోహర్ నాయుడు హాజరయ్యారు. కాగా నరసరావుపేట అభ్యర్థిగా ఎంపిక చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ భేటీకి గైర్హాజరయ్యారు.

సర్వే నివేదికలు చూపి చంద్రబాబు నాయుడు టిడిపి నేతలకు క్లాస్ తీసుకుంటూ ఉంటారు. ఈసారి జగన్ కూడా అదే రూట్లో సర్వే నివేదికలు చూపించి మరీ రివ్యూ నిర్వహించినట్టు సమాచారం. ఒక్కొక్క నేతను మీ మైనస్ లు ఇవి, ప్లస్ పాయింట్స్ ఇవి అంటూ వెల్లడించి సలహాలు సూచనలు ఇచ్చారట జగన్. బలహీనతలు ఎక్కువగా ఉన్న నేతలను నెలరోజుల్లో సరి చేసుకుంటే సరే…లేదంటే సీటు వేరే వారికి వెళ్ళిపోతుంది అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వే నివేదికలు చూపించి మరీ జగన్ సమీక్ష నిర్వహిస్తుంటే నేతలు చెమటలు కక్కినట్టు తెలుస్తోంది.

ఒక ఇంచార్జి కి మాత్రం కాస్త గట్టిగానే చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. మీకు మాటలు ఎక్కువ, తిరుగుడు తక్కువ అని కోప్పడ్డారట. ఇకనైనా నియోజకవర్గ ప్రజలతో మమేకమవ్వాలని హెచ్చరించినట్లు సమాచారం. మరొక ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి, పనితీరు చురుగ్గా లేకపోతే ప్రత్యర్థిని ఎదుర్కోవటం కష్టమని సూచించారు జగన్. ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు వ్యవహారశైలి నచ్చక దూరంగా ఉంటున్న సీనియర్ నేతల వివరాలు కూడా సర్వే నివేదిక ద్వారా వివరించారు జగన్. వారిని కలుపుకుపోయే చర్యలు చేపట్టాలని, ఎన్నికల్లో నెగ్గాలంటే ఇగోలు వదిలి ముందుకుపోవాలని సూచించారని సమాచారం.