జగన్, పవన్ ఏకమవుతున్నారా? చంద్రబాబు పరిస్థితేంటి?

ఇపుడిదే అంశంపై రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది ? ఎందుకంటే, జగన్ తనకు శతృవు కాదని పవన్ స్పష్టంగా ప్రకటించారు కాబట్టి. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్, జగన్ పొత్తులు పెట్టుకుని కలిసి పోటీ చేస్తారనే ప్రచారం ఎప్పటి నుండో వినిపిస్తున్నదే. కాకపోతే ఆ ప్రచారానికి సరైన బేస్ మాత్రం ఎక్కడా కనబడలేదు. అయితే తాజాగా పవన్ ప్రకటనతో మళ్ళీ పొత్తులపై ప్రచారం ఊపందుకుంది. ఎటూ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి రెండు పార్టీల అధినేలతకు బాగా దగ్గరగా ఉండే ప్రముఖులే సయోధ్యకు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.

పవన్ కొన్ని రోజులు చంద్రబాబునాయుడును తీవ్రంగా విమర్శిస్తారు. తర్వాత చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అవుతారు. ఇలా చార్లే జరిగింది.  చంద్రబాబుపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సమయంలోనే రాజధాని ప్రాంతంలోని ఓ ఆలయంలో జరిగిన దశావతార విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో  చంద్రబాబు, పవన్ గంటపాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. పవన్ వ్యవహార శైలి కూడా ఎప్పటికప్పుడు అనుమానంగానే ఉంటోంది. అందుకనే చంద్రబాబును పవన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారంటే చాలామందిలో నమ్మకం కుదరటం లేదు.

వారి ఏకాంత భేటీపై సోషల్ మీడియాలో పవన్ వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుండి చంద్రబాబుతో భేటీ విషయంలో పవన్ జాగ్రత్తగా ఉంటున్నారనే చెప్పాలి. సరే అదంతా చరిత్రనుకోండి. ఇక ప్రస్తుతానికి వస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ , పవన్ మధ్య పొత్తులు కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇద్దరి మధ్య సయోధ్యకు బిజెపిలోని జాతీయస్ధాయి నేతలు ప్రయత్నిస్తున్నారట. ఎలాగైనా చంద్రబాబును గద్దె దింపాలన్న లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న కారణంతోనే  బిజెపి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి వాళ్ళ ప్రయత్నాలు ఎంత వరకూ విజయవంతమవుతుందో చూడాల్సిందే.

ఒక విధంగా జగన్, పవన్ గనుక పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే, ఓటు బదిలీ సక్రమంగా జరిగితే చంద్రబాబు మూటాముల్లె సర్దేసుకోవచ్చనటంలో సందేహం లేదు. జనసేనలో ఇంత వరకూ పార్టీ నిర్మాణమే జరగలేదు. కేవలం అభిమానులు, కాపు సామాజికవవర్గం పైనే పవన్ ఆధారపడినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో జగన్ కు గ్రామస్ధాయి నుండి పట్టిష్టమైన వ్యవస్ధుంది. దానికితోడు చాలా నియోజకవర్గాల్లో గట్టి నేతలున్నారు. నిజానికి వీళ్ళద్దరు కలిస్తే చంద్రబాబు పరిస్ధితి ఎలాగుంటుందో చెప్పనే అక్కర్లేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు రానున్న ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా మారుతుందనే ప్రచారం బాగా జరుగుతోంది. జాతీయ మీడియా సర్వేల్లో కూడా అదే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్ధితుల్లో జగన్ కు పవన్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ, ఏ సర్వేలో చూసినా పవన్ కు సుమారు 6 శాతం ఓట్లున్నట్లు తెలుస్తోంది. 6 శాతం ఓట్లంటే చిన్న విషయం కాదు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు, మోడి, పవన్ కూటమికి జగన్ కు మధ్య ఓట్ల తేడా కేవలం 1.6 శాతమే అన్నది గుర్తుంచుకోవాలి. కాబట్టి చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలకూడదంటే పవన్ తో పొత్తుపెట్టుకుంటేనే జగన్ కు మంచిదని వాదించేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య పొత్తుల విషయం తొందరలో తేలిపోతుందని కూడా అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో ?