తెలుగుదేశంతో ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రేపు అంటే శుక్రవారం చర్చకు వస్తున్నది.చంద్రబాబు నాయుడు సాధారణంగా అన్ని కార్యక్రమాలను ముహూర్తాల ప్రకారం చేపడతారు. ఆయనకు ముహూర్తాల మీద, వాస్తు మీద చాలా గురి. వీటి కోసం కోట్లు ఖర్చు పెట్టి కార్యాలయాలను, ఇళ్లను, కూల్చుకున్నారు, కట్టుకున్నారు, మార్చుకున్నారు, ముస్తాబు చేసుకున్నారు. ఎవరేమనుకున్నా సరే ఈ విషయంలో ఆయన రాజీపడడు. ముహూర్తం చాలా ఇంపార్టెంట్ బాబుకు. ఆయనకు ఈ విషయంలో సలహాలు ఇచ్చేందుకు చాలా మంది పండితులున్నారు. అందుకే పదవి స్వీకారం దగ్గిర నుంచి అన్న క్యాంటీన్ల ప్రారంభం దాకా అన్ని ముహూర్తాల ప్రకారం, ఘడియల ప్రకారమే జరిగాయి. అయితే, ఒకే ఒక్క కార్యక్రమానికి ఆయన ముహూర్తం కుదుర్చుకోలేకపోయారు. అన్ని కార్యక్రమాల ముహూర్తాలు నిర్ణయించడం ఆయన చేతిలోనే ఉండింది. ఒకే ఒక్క కార్యక్రమం ముహూర్తం మాత్రం ఆయన చేతిలో లేకుండా పోయింది. అందువల్ల బెడిసికొడుతుందేమోననే అనుమానం చాలా మంది లో ఉంది. ఆ కార్యక్రమం ఏమిటో తెలుసా? అవిశ్వాస తీర్మానం మీద చర్చ. ఇది తెలుగుదేశం నేతల మధ్య చర్చగా మారింది.
ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలనేగా ఆ విశ్వాసతీర్మానం నోటీసు ఇచ్చింది. ఇది ఒక మహాకార్యం. కాని ఈ కార్యానికి ముహూర్తం ఆయన నిర్ణయించలేకపోయారు. శుక్రవారం ఆవిశ్వాసం తీర్మానం చర్చ చేపట్టాలని లోక్సభ బిఎసి నిర్ణయించింది. అదే విధంగా చర్చ ప్రారంభమయ్యే సమయం కూాాాడా బిఎసి నిర్ణయించింది. టిడిపియే ప్రారంభిస్తున్నా, ఏవరో నిర్ణయించిన ముహూర్తానికి చంద్రబాబు ప్రతినిధి చర్చ ప్రారంభిస్తారు. ఆయన తలపెట్టిన కార్యక్రమం ఆయన ముహూర్తానికి కాకుండా మరొకరి ముహూర్తానికి జరగడం ఈ నాలుగేళ్లలో ఇదేమొదటిసారి. (ఆయన ముహూర్తాలు ఏమయ్యాయో అమరావతి, పోలవరం, రాజమండ్రి లలో చూడండనే వాళ్లున్నారు, అది వేరేకథ) అందుకే ఈ శుక్రవారం చంద్రబాబు అచ్చొస్తుందా అనేదాని మీద కొంతమది టిడిపి నేతలు గుసగుస లాడుతున్నారు.
అచ్చొచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. ఎందుకో చూడండి.
ప్రధాని మోదీ నాయత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎదుర్కొంటున్న మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ఇది. తీర్మానం నెగ్గే అవకాశాలు తక్కువే అయినా, బిజెపికి చెమటలు పట్టించే అవకాశం ఉంది.
టిడిపి కాంగ్రెస్ తో పాటు చాలా పార్టీలు చొక్కాల చేతులు పైకి మడుస్తున్నాయి. ఏదో ఒక విధంగా అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించుకుని తమ ఉనికి చాటుకోవాలనుకుంటున్నాయి. ఎందుకుంటే, తనకు పిచ్చిబలంతో ప్రధాని మోదీ ఎవ్వరీని ఖాతరు చేయడం లేదు. చంద్రబాబు సమస్య కూడ అదే. ఇతర పార్టీలు కలిసొచ్చి మోదీ ప్రధాని ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తే చాలుననేది ఆయన ఆలోచన. ముహూర్తబలం ఉంటే కనీసం ఇదైనా జరగాలి. ఈ ‘కసి’ఎందుకంటే 23 సార్లు ప్రధానిని కలుసుకున్నారు. చాలా సార్లు ఆయనకు అపాయంట్ మెంట్ కూడా రాలేదు. ఈ బాధ ఆయన లో చాలా ఉంది. ఒకప్పుడు ఢిల్లీ నాయుడంటే కింగ్ మేకర్. వాజ్ పేయి ఆయనకు అంత గౌరవం ఇచ్చారు. అదే ఎన్డీయే, అదే నాయుడు. ఇప్పటి ఎన్డీయే కూడా అదే. కాకపోతే నాయకత్వం వహిస్తున్న మోదీ మాత్రం చంద్రబాబును ‘ఆయనొక సిఎం’గా చూస్తున్నారు తప్ప ఒకప్పుడు బిజెపిని ఆదుకున్న ఆప్తుడిలాగా చూడటమే లేదు. రేపటి ఫ్రైడ్ ఫైట్ వెనక ఈ కసి కూడా ఉంది.ఈ ఫ్రైడే ఫైట్ లో ఎవరెటున్నారో చూద్దాం.
ఇప్పటి లోక్‌సభలో ఖాళీ 8 స్థానాలు ఖాళీ. ప్రస్తుతం ఉన్న ఎంపిలు 535. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంలే మేజిక్ ఫిగర్ 268 మంది ఓటేయాలి. 535 సభ్యుల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 311 మంది సభ్యులున్నారు. ఇందులో బీజేపికి సొంత బలగం 271 మంది ఎంపీలు. ప్రతిపక్షంలో కాంగ్రెస్‌తో పాటు ఎన్డీయేతర, యూపీయేతర పార్టీల బలం 225 మంది సభ్యులు.
అందుకే ఎన్డీయే పక్షంలో కూడా మోదీ అంటే గిట్టని శివసేన వంటి పార్టీ లున్నాయి. అదే విధంగా ఎన్డీయే బయట ఆవిశ్వాస తీర్మానానికి మద్దతు నీయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్ )వంటి పార్టీ లున్నాయి.
ఈ అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే కూటమిలోని శివసేన, ఎల్జేపీ, అకాళీదళ్‌తో పాటు 12 మంది ఇతర పార్టీల ఎంపీలు వ్యతిరేకంగా ఉన్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా కాంగ్రెస్, టీఎంసీ, టీడీపీ, సీపీఎం, ఎన్సీపీ, ఎస్పీతో పాటు ఇతర పార్టీలకు చెందిన 24 మందితో కలిపి ఇప్పటివరకు మొత్తం 145 మంది ఎంపీలమద్దతు కూడ గట్టినట్లు చెబుతున్నారు.అయితే, మరొక ఆసక్తి కరమయిన అంశం ఒకటుంది. పార్లమెంటు కొన్ని పార్టీలు తటస్థంగా ఉంటున్నాయి. ఇలాంటి చర్య అధికార పక్షానికి సహకరిస్తుంది. ఈ జాబితాలోకి టీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీజేడీలతో 80 మంది ఎంపీలున్నారట. ఫ్రైడే ఫైట్ వీళ్ల వల్ల ఆసక్తిగా మారబోతున్నది. ఓటింగ్ సమయానికి వీళ్లు ఎటువైపు ఉంటారనేది నిలువెత్తు ప్రశ్న ఇపుడు. ఓటింగ్ లోగా ఏదయిన జరగవచ్చు. అవిశ్వాసం మద్దతుదారుల బలగం పెరగవచ్చు. తరగ వచ్చు.