మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ 69వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ పట్టుదల, సేవా గుణాన్ని ఆయన కొనియాడారు. హరికృష్ణ తరతరాలకు గుర్తుండిపోయే నాయకుడని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ: హరికృష్ణ తన ప్రత్యేక శైలితో, పట్టువదలని స్వభావంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేసుకున్నారు. “ప్రజాసేవలో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసిన హరికృష్ణ, తరతరాలకు గుర్తుండిపోయే నాయకుడు” అని ఆయన అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో చైతన్య రథసారథిగా ఆయన పోషించిన పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు.
రాజకీయాలతో పాటు నటుడిగా కూడా హరికృష్ణ అసమానమైన ప్రతిభను చూపించారని చంద్రబాబు ప్రశంసించారు. వెండితెరపై ఆయన చూపిన నటన చిరస్మరణీయమని అన్నారు. రాజకీయ, సినీ రంగాలలో తనదైన ముద్ర వేసిన హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హరికృష్ణ పట్టుదలకు మారుపేరుగా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి అన్నారు.



