తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిల ఎమ్మెల్యే సభ్యత్వ రద్దు కేసులో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ ఉత్తర్వులిచ్చారు. గవర్నర్ ప్రసంగం సమయంలో గవర్నర్ పైన దాడి చేశారని వారి పై ఆరోపణలున్నాయి. దీంతో దీని పై అప్పటి స్పీకర్ యాక్షన్ తీసుకున్నారు. ఘటనకు కారణమైన ఇద్దరు ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ మరియు ఎమ్మెల్యేలుగా సభ్యత్వం రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారు.

స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోమటిరెడ్డి మరియు సంపత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు విచారణల తర్వాత వారి సభ్యత్వాన్ని పునరుద్దరించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ దానిని ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణకు అసెంబ్లీ న్యాయ శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. దీంతో కోర్టు వారి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అసెంబ్లీ న్యాయశాఖ కార్యదర్శులను కస్టడీలోకి తీసుకొని 10 వేల రూపాయల పూచీకత్తు కడితేనే వదిలి పెట్టాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా మాజీ స్పీకర్ మధుసూధన చారికి మరియు నల్లగొండ, గద్వాల ఎస్పీలకు కోర్టు నోటిసులు జారీ చేసింది. తామిచ్చిన తీర్పు అమలు చేయకపోవడం ఏంటని కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలతో అసెంబ్లీ న్యాయ శాఖ కార్యదర్శులు పదివేల రూపాయలు కట్టారు.