ఆ పని చేసింది మోదీ యే.. నేను కాదు : చంద్రబాబు

– మోదీని మోసగాడన్న చంద్రబాబు
– మోదీనే యూ టర్న్ తీసుకున్నారన్న చంద్రబాబు
– తిరుమలేశుని సాక్షిగా అబద్దాలాడిన మోదీ
– తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడం

అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. ఏపికి కేంద్రం అన్యాయం చేసిందని, నేను యూ టర్న్ తీసుకోలేదని కేంద్రమే యూటర్న్ తీసుకుందని దుయ్యబట్టారు. చంద్రబాబు మాట్లాడుతూ..

“ఏపికి జరిగిన అన్యాయం తెలియజెసేందుకే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టాం. 15 ఏళ్ల తర్వాత మేమే అవిశ్వాస తీర్మానం పెట్టాం. మెజారిటి వర్సెస్ నిజాయితీకి మధ్య పోరాటం జరిగింది. విభజన సమయంలో అప్పటి ప్రధాని ఏపికి ఎన్నో హామీలనిచ్చారు. ప్రధాని మోదీ కూడా గతంలో ప్రత్యేక హోదాపై హామీనిచ్చారు. ఢిల్లీ చిన్నబోయేలా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తామని తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోదీ చెప్పారు. ఏపి అభివృద్ది కోసమే ఆనాడు బిజెపితో కలిశాం. ఢిల్లీకి 29 సార్లు వచ్చి విన్నవించా కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేంద్రాన్ని నిధులు అడుగుతూనే మేం కూడా రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి కష్టపడుతున్నాం. పార్లమెంటు తలుపులు మూసి విభజించారని మోదీనే చెప్పారు, తల్లిని చంపి పిల్లను విడదీస్తున్నారన్న మోదీ ఈ రోజు ఆ తల్లిని ఎందుకు కాపాడలేకపోతున్నారు. విభజన చట్టాన్ని అమలు చేస్తామని అమరావతిలో చెప్పారు మరేందుకు అది అమలు చేయలేకపోతున్నారు. మోదీ మోసం చేశారు. పార్లమెంటులో ఓ మోసగాడిలా ప్రవర్తించారు.

ఎవ్వరికీ పన్ను రాయితీలు లేవన్నారు, కానీ ఇప్పటికి 11 రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చారు. ఏపీ 10.5% వృద్ది రేటుతో ముందుకు సాగుతుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక ప్రధానితో మాట్లాడాను. మీరు వైసిపి వలలో పడ్డారని ప్రధాని అన్నారు. నేను కళంకిత రాజకీయాలకు పాల్పడనని ప్రధానికి స్పష్టంగా చెప్పాను. అవినీతిని సహించమంటూనే గాలి సోదరులకు టిక్కెట్ ఇచ్చారు. హోదా పేరుతో 14 వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టించారు. ఇదేనా కేంద్రం రాష్ట్రాలతో కొనసాగించే విధానం అని ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు మరి మీరు చేసిందేమిటి, ఎవరికీ ప్రత్యేక హోదా లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజి ఇస్తానన్నారు. నేనేప్పుడు ప్రత్యేక ప్యాకేజి ఒప్పుకోలేదు. నాపై మోదీ చేసిన వ్యాఖ్యలు బాధించాయి. హైదరాబాద్ కు ఒక రూపం ఇచ్చింది నేనే. ఇప్పుడు హైదరాబాద్ ఉత్తమ నగరంగా ఉంది. హైదరాబాద్ నా మానస పుత్రిక. దానికి నేను గర్వపడుతున్నా.

ఎఫ్ ఆర్ బీఎం రిలిఫ్ ఇస్తే మేం రుణాలు తెచ్చుకుంటాం కదా. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే విధంగానే ఏపికి ఇవ్వాలని అడిగా అవి వేరు ఇది వేరు అంటున్నారు. కేసీఆర్ పరిణతి చెందిన వారని, మేం కాదన్నట్టుగా పీఎం అన్నారు. ఒక ప్రధాని ఆ విధంగా మాట్లాడొచ్చా. మోదీ రాజకీయాలకు 2002లో పరిచయమయ్యారు. నేను 1995లోనే సీఎం అయ్యాను. అది గుర్తుపెట్టుకోవాలి. వైసిపి ఒక అవినీతి పార్టీ, నిన్న జగన్ జైల్లో ఉంటే మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఉన్నారు. ఢిల్లి కంటే మెరుగైన రాజధాని కడతామని రూ. 1500 కోట్లు ఇవ్వడమేంటి. అమరావతి వల్ల రాష్ట్రం కన్నా కేంద్రమే ఎక్కువ లాభపడుతది. 1500 కోట్లతో కేబుల్ వర్క్ కూడా పూర్తి కాదు. పోలవరంలో 57శాతం పనులు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు జమచేసి మళ్లీ వెనుకకు తీసుకుంది. ఏపీ లో ఎయిర్ పోర్టులు చాలా అధ్వానంగా ఉన్నాయి. 1500 కోట్లు కావాల్సిన ఎయిర్ పోర్టులకు 200 కోట్లు ఇచ్చారు ఎలా అభివృద్ది అవుతుంది. యూటర్న్ నాది కాదు. ఇచ్చిన హామీలను అమలు చేయని మీది యూటర్న్. నేను తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడను.

ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్లకు వేలకోట్లు ఇచ్చింది నిజం కాదా. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మేము నెంబర్ వన్ గా నిలిచాం. దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ ను మరిచారు. ఏపీకి అనగానే నిబంధనలు అడ్డు వస్తున్నాయా. ఒక దేశ సమస్యలను పరిష్కరించడంలో మోదీ విఫలమయ్యారు. మద్దతిచ్చిన అన్ని పార్టీలకు, ఎంపీలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పోరాటం ఆగదు. ఏపికి రావాల్సినవి సాధించుకునే వరకు పోరాడుతాం. ఎంపీలతో సమావేశమయ్యాక భవిష్యత్ కార్యాచరణేంటో తెలుపుతాం” అని చంద్రబాబు అన్నారు.