రాజ్యాంగవ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం 

 
“మీరు జీవోలు తయారు చేస్తూండండి…మేము వాటిని కొట్టేస్తుంటాము”  అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య పోటీ జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది.  గత ఏడాది కాలంలో సుమారు డెబ్బై జీవోలు న్యాయస్థానాల కొట్టివేతకు గురయ్యాయట.  అలాగే మూడువందలకు పైగా పిల్స్ హైకోర్టులు దాఖలు అయ్యాయట… గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.  జీవోలను తయారుచేసే అధికారులు, సలహాదారుల్లో లోపాలు ఉన్నాయా, లేక ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే న్యాయనిపుణుల్లో ఉన్నాయా, లేక కోర్టులో సమర్ధవంతంగా వాదించే న్యాయవాదుల్లో లోపాలు ఉన్నాయా లేక కోర్టులోనే లోపాలు ఉన్నాయా అనే విషయం అర్ధం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.  
 
నిజానికి కేబినెట్ నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం జరగదు.  ప్రభుత్వం చేసే నిర్ణయాలలో తప్పొప్పులకు ప్రభుత్వసారధులే బాధ్యులు.  కేబినెట్ తీసుకునే నిర్ణయాలు ప్రజోపయోగమైనవని ప్రజలు నమ్మితే మరుసటి ఎన్నికల్లో కూడా వారికి అధికారం దక్కుతుంది.  ప్రజా వ్యతిరేకమైనవైతే ఓటమి సంప్రాప్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో మనం చూస్తున్న సంప్రదాయాలు ఇవే.  దేశమంతటికీ న్యాయశాస్త్రం ఒకటే అయినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం లేదు.  ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు కొట్టేయడం చాలా అరుదుగా జరుగుతుంటాయి.  కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం.  ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడమే ఆలస్యం…కోర్టులు వాటిమీద స్టే ఇస్తున్నాయి లేదా కొట్టివేస్తున్నాయి.   ప్రభుత్వంలోని న్యాయవాదులను అందుకు తప్పు పడదామా అంటే వారేమీ ఆషామాషీ నిపుణులు కారు.  వారి వృత్తిలో తలపండినవారు.  ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చే దుర్మార్గాలకు వారు పాల్పడతారనుకోవడం అపోహ మాత్రమే.  
cm-ys-jagan-ap-high-court - NewsXPRESS | Telugu
సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోర్టులు వాటిలో వేలు పెట్టడం సహజమే.  కానీ, పదిమంది మరణానికి కారకుడైన ఒక ఆసుపత్రి యజమానిమీద ప్రభుత్వం కేసులు పెడితే, ఆ నిందితుడి మీద చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అని ఆదేశించడం ఏ రాజ్యాంగసూత్రాల ప్రకారం సబబో తీర్పు ఇచ్చినవారికే తెలియాలి.  అలాగే విద్యావిధానం అనేది రాష్ట్రాల హక్కు.  ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన విధానాన్ని రూపొందించుకుంటుంది.  దానిలో ఏమైనా లోపం ఉంటె దాన్ని సవరించి ప్రభుత్వానికి మార్గం చూపాలి తప్ప విచారణను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పొతే లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ఏమి కావాలి?  ప్రభుత్వ వాదనలను ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడమే ధ్యేయంగా రాజకీయ కుతంత్రాలు పన్నేవారికి వత్తాసు పలుకుతూ ప్రజాశ్రేయస్సును కాలరాయడం న్యాయసమ్మతమా?   శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు పంతాలకు పోతే మధ్యలో నలిగిపోయేది ఎవరు?
 
Andhra HC initiates contempt proceedings against YSRCP MP, 48 others for intimidating judges
 
ఇక మద్యం కొనుగోలుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు మరీ విడ్డూరంగా ఉంది.  పొరుగు రాష్ట్రాల్లో మద్యం కొనుక్కుని ఇంటికొచ్చి తాగొచ్చని ఏ రాజ్యంగంలో రాసి ఉంది? ఇక సరిహద్దుల్లో చెక్ పోస్టులు దేనికి?  ఆబ్కారీ శాఖ దేనికి?  అన్నీ మూసేసి తాగి తన్నుకోండని తీర్పు ఇస్తే సరిపోతుంది కదా?    తమ రాష్ట్ర ఆదాయం పొరుగు రాష్ట్రాలకు పోకుండా కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు లేదా?  అసలు మద్యపానాన్ని నిషేధించి మహిళల సంక్షేమం కోసం కృషి చెయ్యాలనే ప్రభుత్వ ఆశయం గౌరవ న్యాయస్థానాలు ఎందుకు పట్టించుకోవడం లేదు?  
1 day 3 jolts…. High Court takes on YS Jagan..! | OK Telugu
ఒకటి మాత్రం నిజం.  ఇదేవిధమైన వాతావరణం కొనసాగితే రెండు ప్రధానవ్యవస్థల మధ్య ఘర్షణ నెలకొనడం ఖాయం.  ప్రజలు కూడా ఇలాంటి అక్రమ తీర్పులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారేమో అన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ పరిశీలకులు.  అప్పుడు శాంతిభద్రతలకు కూడా భంగం వాటిల్లే అవకాశం ఉన్నది.  కనుక శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ రెండూ అవగాహనతో మెలుగుతూ ప్రజాక్షేమం కోసం పని చెయ్యాలి.  ఈ ప్రతికూల తీర్పుల వెనుక ప్రతిపక్ష తెలుగుదేశం హస్తం ఉన్నదని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.  ఆ మేరకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోతోంది.  రాజకీయపార్టీలు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉన్నది.