ఏడాదిలో జగన్ హాఫ్ సెంచరీ కొట్టేశారు. ఇదీ ఓ రికార్డే!

YS Jagan compromise to reduce liquor rates 

ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వయసు సంవత్సరం కూడా దాటలేదు. కానీ ఏకంగా 50 సార్లకు పైగా కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నారు. బహుశా ఈ దేశ చరిత్రలో ఇన్నిసార్లు కోర్టుల చేత తిరస్కరించబడిన పాలన ఇదే కాబోలు. ఇవి చూస్తుంటే.. ఇక రానున్న రోజుల్లో కుదిరితే పాలనను కూడా కేంద్రానికి లేదా ప్రతిపక్షానికి అప్పగించాలని తీర్పు వచ్చినా ఆశ్చర్యం ఏమీ ఉండదు.

భారీ మెజార్టీతో 151 అసెంబ్లీ సీట్లను ప్రజలు జగన్‌కు ఇచ్చారు. అయితే ఇంతటి భారీ మెజార్టీ ప్రజలు ఇచ్చినా జగన్ మాత్రం తాను అనుకున్న ఒక్కపని కూడా, అలాగే ఒక్క చట్టాన్ని కూడా ఏ అడ్డంకులు లేకుండా చేసుకోలేకపోతున్నారు. చిన్నా, చితక ఏ నిర్ణయం అయినా సరే కోర్టు మెట్లు ఎక్కి మళ్లీ తర్జన భర్జనలు పడుతూ వెనక్కి తగ్గుతున్నారు. చివరికి ఎన్నికల సంఘం కూడా ముఖ్యమంత్రిని సంప్రదించకుండానే స్థానిక ఎన్నికలు వాయిదా వేయగలిగారు అంటే.. ఇక ప్రజలిచ్చిన అధికారం ఏ విధంగా సద్వినియోగం అవుతున్నట్లు??

ఇవన్నీ చూస్తుంటే.. అసలు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపం ఉందా? లేక వాటిని ఎగ్జిక్యూట్ చేసే విధానంలోనా అన్నది అంతుచిక్కడం లేదు గానీ.. ఆయన తీసుకున్న నిర్ణయాలను ఓ సారి చూస్తే.. రివర్స్ టెండరింగ్, రాజధాని భూముల్లో పేదలకి పట్టాలు, ఆంగ్ల మాద్యమం, చివరాకరికి పంచాయతీ కార్యాలయాలకు పార్టీ జెండా రంగులు ఇలా ప్రతి నిర్ణయం ఓ వివాదాస్పదంగానే మారింది. కోర్టులు ఊహించని రీతిలో చీవాట్లు పెట్టేలా చేశాయి. ఇక రాజధాని మార్పు అంశం అయితే ఎన్నో మెలికలు తిరిగి కోన్ని కార్యాలయాల తరలింపులకు కూడా కోర్టు అడ్డుకట్ట వేసింది. ఇక నేడు అయితే రంగులు తొలగించాకే స్థానిక ఎన్నికలు అంటూ ఝలక్ ఇచ్చింది. 

మరి ఇవన్నీ చూస్తుంటే.. ప్రజలు ప్రత్యక్షంగా అధికారం కట్టబెట్టినా పరోక్షంగా(ప్రతిపక్షం కోరుకున్న రీతిలో) కోర్టులే రాష్ట్రంలో పాలనను నిర్దేశిస్తాయి. రాజ్యాంగ వ్యవస్థలను అర్థం చేసుకోకపోతే ఐదేళ్ల కాలం పాలన కూడా కష్టం అయిపోతుంది.