నాగబాబు మంత్రివర్గంలోకి రావడం లోకేశ్‌కి ఇష్టం లేదా?, లోకేష్ ఎత్తుగడలను పవన్ కల్యాణ్ పసిగట్టరా?, ఆయన వ్యూహాలను పవన్ తనదైన స్టైల్‌లో చిత్తు చేశారా?, ఊపిరాడని స్థితిలోనే టిడిపి నాగబాబుకు ఎమ్మెల్సీ ఓకే చేసిందా?, ఈ పరిణామం పవన్ – లోకేష్‌ల మధ్య గ్యాప్ ఇంకా పెంచిందా?, కొందరు టీడీపీ నేతల, అనుకూల మీడియా వ్యూహాలను ఛేదించి పవన్ తన మాట నెగ్గించుకున్నారా?, వీటన్నింటికీ ఎస్ అన్న సమాధానమే వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానం దక్కకుండా, ఆయన రాష్ట్ర మంత్రివర్గంలోకి రాకుండా అడ్డుకోవడానికి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవంతంగా తిప్పి కొట్టారు. టిడిపి నాయకులు, అనుకూల మీడియాలోనూ నాగబాబు రాజ్యసభకు వెళతారని, ఆయనకు రాష్ట్రంలో కార్పొరేషన్ పదవి ఇస్తారని రకరకాలుగా ప్రచారం చేసి పవన్‌తో మైండ్ గేమ్ ఆడారు. అయితే పవన్ వీటికి సమర్థంగా చెక్ పెట్టారు. నేరుగా చంద్రబాబును కలసి నాగబాబుకి ఎమ్మెల్సీ టికెట్‌ను ఖరారు చేసుకున్నారు. అంతేకాకుండా వెంటనే నాగబాబుతో నామినేషన్ వేయించారు. కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఐదుగురిని ఒకేసారి కాకుండా నాగబాబు అభ్యర్థిత్వాన్ని విడిగా పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని బట్టే దీని వెనుక జరిగిన రాజకీయం అర్థమవుతోంది.
స్తబ్దుగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక కుదుపు తెచ్చాయని చెప్పవచ్చు. 2025 ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించడంలో పవన్‌కల్యాణ్ పోషించిన పాత్ర ఏపీ రాజకీయాల్లో ఆయన ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రకటించిన పవన్.. ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేసి టీడీపీ, బీజేపీలతో జట్టు కట్టి కూటమి అధికారంలోకి రావడంలో కీ రోల్ పోషించారు. అందుకే ఎన్నికల ఫలితాల అనంతరం అందరూ పవన్‌ను ఆకానికెత్తేశారు. చంద్రబాబు అయితే పవన్‌ను గేమ్ ఛేంజర్ అని కీర్తించారు. ప్రధాని మోదీ అయితే పవన్ నహీ హె తుఫాన్ హై అంటూ ఎన్నికల విజయంలో ఆయన పాత్రను మెచ్చుకున్నారు. ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించడమే కాక డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తనదైన స్టైల్‌లో దూసుకోపోవడం టీడీపీలో ఒక వర్గం నాయకులకు, ముఖ్యంగా లోకేశ్‌కు ఇబ్బందిగా మారిందని వదంతులు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో పాటు పవన్‌కల్యాణ్ ఫొటోలు కూడా ఉంచడం ఆ వర్గం వారికి ఇష్టం లేదు. అందుకే ప్రభుత్వ కార్యక్రమాలు, సభలు నిర్వహించే సమయంలో ఫ్లెక్సీల్లో చంద్రబాబు, పవన్‌తోపాటు లోకేశ్ ఫొటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
లోకేశ్‌ను భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ప్రొజెక్టు చేస్తున్న ఆ వర్గం నాయకులు రాష్ట్రంలో పవన్‌కు పెరుగుతున్న పొలిటికల్ ఇమేజ్‌ను చూసి తట్టుకోలేకపోతున్నారు. పవన్‌కు సహజంగా ఉన్న సినీ గ్లామర్‌కు తోడు పొలిటికల్ ఇమేజ్ ఈ రేంజ్‌లో పెరిగితే లోకేశ్‌కు ఫ్యూచర్‌లో ఇబ్బందులు తప్పవని వారు భావిస్తున్నారు. అందుకే ఆ మధ్య లోక్‌శ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలనే అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వంలో పవన్ స్థాయిని తగ్గించాలని ఎత్తు వేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.
గాలికి నిప్పు తోడైనట్టు అసలే హై హేండెడ్‌గా ఉన్న పవన్‌కు ఆయన అన్న నాగబాబు తోడైతే వ్యక్తిగతంగా తమకు, టీడీపీ భవిష్యత్తుకు ఇబ్బంది అని భావించిన లోకేశ్ వర్గం నాగబాబును అడ్డుకోవడానికి తెరవెనుక పెద్ద ప్రయత్నాలే చేసింది. ఆయనకు గతంలో టీడీపీ బోర్డు చైర్మన్ పదవి, రాజ్యసభ స్థానం దక్కకుండా అడ్డుకొంది. అదే తరహాలో తాజాగా తమ అనుకూల మీడియాలో నాగబాబుకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి ఇవ్వనున్నారని, లేదా రాజ్యసభకు పంపుతారని ప్రచారం చేయించింది. ఇలా మైండ్ గేమ్ ఆడి, చివరిలో చంద్రబాబు ద్వారా ఒప్పించి నాగబాబు ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకోవాలని లోకేశ్ వర్గం ప్రయత్నించింది.
అయితే ఈ వ్యూహాలను ముందే పసిగట్టిన పవన్ కల్యాణ్ వేగంగా పావులు కదిపారు. నేరుగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టి చంద్రబాబు వద్ద ఓకే చేయించుకున్నారు. కూటమి తరఫున మిగిలిన ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే వరకు ఆగకుండా నాగాబాబును పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ మర్నాడే నామినేషన్ వేయాలని ఆదేశించారు. లోకేశ్, ఆయన వర్గం ఎత్తులను పవన్ చిత్తు చేయడంతో వారు బిత్తరపోయారు. కానీ ఈ విషయాలేమీ తనకు తెలియనట్టు కూటమి నేతగా లోకేష్ నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విధంగా గుంభనంగా రాజకీయాలు నడుపుతూ అటు పవన్ కళ్యాణ్, ఇటు లోకేష్ రాను రాను రాటు దేలిపోతున్నారు.
అయితే ఈ పరిణామాలు ఇప్పటికే పవన్, లోకేశ్ మధ్య ఉన్న గ్యాప్‌ను మరింత పెంచాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.