Shyamala:వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల రాజకీయాల పరంగా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈమె తరచూ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కూటమి పనితీరుపై అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈమె ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.
మంగళవారం వైయస్ఆర్ జిల్లాలోని జ్యోతి కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యోతిక్షేత్రంలోకాశి నాయన పరిత్యాగం చెందారని, ఆయన ఆలయాన్ని నిర్మించేందుకు అటవీశాఖ ఇబ్బందులు సృష్టించడం దురదృష్టకరమన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్‌రెడ్డి, గోవిందరెడ్డి సహకారంతో జ్యోతిక్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మవాదియై జ్యోతిక్షేత్రంలో కూల్చివేతలపై స్పందించకపోవడం విచారకరమన్నారు. సనాతన ధర్మం గురించి హిందూ మతం గురించి ఎంతో గొప్పలు చెబుతూ దీక్షలు చేస్తూ తిరుగుతున్న సనాతన ధర్మవాది పిఠాపురం పీఠాధిపతి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ పవన్ కళ్యాణ్ పట్ల శ్యామల తీవ్ర విమర్శలు చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
