సౌత్ ఇండస్ట్రీలో హై బడ్జెట్ చిత్రాలను నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు విపరీతమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ‘2.0’, ‘పొన్నియన్ సెల్వన్’, ‘ఇండియన్ 2’ వంటి మెగాప్రాజెక్ట్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, ప్రస్తుతం మాత్రం కేవలం 20 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలకు ఫైనాన్స్ కోసం ఇతర ప్రొడక్షన్ హౌజ్‌లను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల లైకా, ఓ ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ప్రయత్నించిందని టాక్. హై బడ్జెట్ సినిమాలు తీసే సంస్థగా పేరొందిన లైకా, చిన్న చిత్రాలకు అర్థిక మద్దతు కావాలని చూస్తోందంటే, సంస్థ ఆర్థికంగా కష్టాల్లో ఉందని భావిస్తున్నారు. దీనికి తోడు, మోహన్‌లాల్, పృథ్విరాజ్ నటిస్తున్న ‘L2: ఎంపెరర్’ సినిమాపై కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
‘లూసిఫర్’ తర్వాత భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, బిజినెస్ విషయంలో స్పష్టత లేదని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరోవైపు, ఈ ప్రాజెక్ట్‌కి జెమిని ఫిల్మ్ సర్క్యూట్స్, గోకులం ప్రొడక్షన్స్ మద్దతుగా నిలిచినట్లు సమాచారం. లైకా గతంలో ఎన్నో భారీ ప్రాజెక్టులను నిర్మించినా, ఇప్పుడు చిన్న సినిమాల కోసం మిగతా నిర్మాణ సంస్థలను ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇది పూర్తిగా ఆర్థిక సమస్యల కారణమా లేక వ్యాపార వ్యూహాల మార్పా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ఇటీవల మారుతున్న పరిస్థితులు, లైకా భవిష్యత్తుపై అనేక అనుమానాలను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సంస్థ తిరిగి పుంజుకుంటుందా లేక మరిన్ని మార్పులు జరుగుతాయా అనే దానిపై సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి, లైకా మళ్లీ భారీ ప్రాజెక్ట్‌లను ప్రొడ్యూస్ చేసే స్థాయికి చేరుకుంటుందా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.