‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు గడిచినా, రామ్ చరణ్ – ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఎవరు అసలు కథానాయకుడు అనే చర్చ ఆగడం లేదు. సినిమా రిలీజ్ సమయంలో దర్శకుడు రాజమౌళి ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పినా, ఫ్యాన్స్ మాత్రం ఇంకా తమ హీరోకే ఎక్కువ రోల్ ఉందని నొక్కి చెబుతున్నారు. ఈ వివాదానికి తాజాగా ట్విట్టర్ (X) లోని AI బాట్ గ్రోక్ మళ్లీ నిప్పు రాజేసింది.
ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. “RRRలో భీమ్ (ఎన్టీఆర్) ప్రధాన కథానాయకుడు. మల్లిని రక్షించేందుకు భీమ్ ప్రయాణం మొదలవుతుంది. మొదట కథ ఇదే. అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) కీలక పాత్రలో ఉన్నా, కథను ముందుకు నడిపించేది భీమ్ క్యారెక్టర్.” అని గ్రోక్ తెలిపింది. ఈ సమాధానం బయటకొచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
“ఇదిగో చూడండి.. AI కూడా భీమ్‌కే అసలు హీరోగా గుర్తించింది!” అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే, రామ్ చరణ్ అభిమానులు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. “కథలో అసలు ట్విస్ట్ తెచ్చేది, ఎమోషనల్ కంటెంట్ పెంచేది రామ్ చరణ్ పాత్ర” అంటూ వాదిస్తున్నారు. ఈ వివాదం కొత్తది కాదు. రాజమౌళి ఇప్పటికి ఎన్నోసార్లు “ఇద్దరూ సమానమైన పాత్రలు పోషించారు, కథలో ఏ ఒక్కరినీ ఎక్కువగా, మరొకరిని తక్కువగా చూడకండి.” అని చెప్పినా, ఫ్యాన్స్ మాత్రం తాము నమ్మినదానిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
కథ ఆరంభం భీమ్ యాక్షన్‌తో మొదలవడం, కథ ఎమోషనల్ గా కదిలేది రామ్ చరణ్ పాత్ర వల్ల జరగడం.. ఇలా ప్రతి ఒక్కరు తమదైన కోణంలో తమ హీరో పాత్ర ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నారు. ఇప్పుడు AI కూడా దీనికి జడ్జ్ గా మారిపోవడంతో వాదోపవాదాలు మళ్లీ ముదిరాయి. ఎవరు అసలు కథానాయకుడో అనే చర్చ ఎంత మార్మోగినా, చివరికి ‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం మాత్రం ఇద్దరి కృషితో సాధ్యమైంది. రాజమౌళి విజన్, హీరోల పెర్ఫార్మెన్స్.. రెండూ కలిసే సినిమా గొప్పతనాన్ని నిరూపించాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వివాదాన్ని ఇట్టే మర్చిపోయేలా లేరు.