సినిమా రంగంలో హీరోల నటనతో పాటు వారి నిర్మాణ వ్యాపార అడుగులు కూడా కీలకమవుతున్నాయి. ఈ క్రమంలో నాని నిర్మాతగా తన మార్క్ చూపిస్తున్నాడు. ఇటీవలే ఆయన నిర్మించిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ ఆశించిన దాని కంటే గొప్ప విజయాన్ని సాధించింది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, తక్కువ బడ్జెట్‌తో మంచి కలెక్షన్లు సాధించడమే కాకుండా, నాని నిర్మాణ వ్యూహాలకు మరింత బలాన్నిచ్చింది.
థియేటర్ రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా లాభాల బాట పట్టిన ఈ చిత్రం, విడుదల తర్వాత కూడా అనూహ్యమైన వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే నాని ‘అ!’, ‘హిట్’ వంటి సినిమాలతో నిర్మాతగా తన పరిజ్ఞానాన్ని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ‘కోర్ట్’ విజయం మరో కొత్త మార్గాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. లాయర్ కథాంశంతో నడిచే ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోందా లేదా మరొక లీగల్ థ్రిల్లర్‌గా రూపొందనుందా అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
నాని ఇటీవల ఇచ్చిన హింట్ ప్రకారం, ఈ సినిమాను ఫ్రాంచైజీగా తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోర్ట్ రూమ్ డ్రామాలకు విస్తృతమైన ప్రేక్షకాదరణ ఉండటంతో, ఈ తరహా ప్రయోగాలకు స్థానం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సినిమా కలెక్షన్లు మంచి స్థాయిలో కొనసాగుతున్నాయి. ఓటీటీ మార్కెట్‌లో కోర్ట్ తరహా సినిమాలకు డిమాండ్ ఉండటంతో, ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా ఇదే దిశగా ఉండవచ్చని పరిశీలకులు చెబుతున్నారు.
కోర్ట్ 2 తీయాలా లేక మరో కమర్షియల్ ఎంటర్టైనర్ చేసిన తర్వాతా ఆ దిశగా అడుగులు వేయాలా అనే అంశంపై నాని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు రామ్ జగదీష్ ఇప్పటికే మరో ప్రాజెక్టుకు అంగీకరించడంతో, కోర్ట్ సీక్వెల్ ఆలస్యం కావచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఈ విజయం ద్వారా నాని మరో భారీ ఫ్రాంచైజీకి బీజం వేస్తున్నాడా లేదా హిట్ తరహాలో మరో కొత్త కాన్సెప్ట్‌ను ప్రయోగించనున్నాడా అన్నది వేచి చూడాల్సిన విషయం.