పవన్‌కూ తప్పని రాజకీయ కలవరం?

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కి రాజకీయ ఆందోళన మొదలైందా?  ఆయనకు 2019 ఎన్నికల గుబులు గుండెలో పట్టుకుందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటికే జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్న పవన్..జిల్లాల పర్యటన ముగిసిన తర్వాత తాను తిరిగిన జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారని ఓ సర్వే చేయించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ సర్వే ఫలితాలను చూసి పవన్ కాస్త కలవర పడ్డట్టు తెలుస్తోంది.

పవన్ నాలుగు విభాగాలుగా విభజించి సర్వే చేయించారట.18-30 సంవత్సరాలు కలిగిన వారిని ఒక వర్గంగా, 30-45ఏళ్లు కలిగిన వారిని ఒక వర్గంగా, 45 ఏళ్లు పైబడిన వారిని మరో వర్గంగా విభజించారట. అలాగే గ్రామీణ-పట్టణ ఓటర్లుగా విభజించి మరో వర్గంగా మొత్తం నాలుగు విభాగాలుగా సర్వే చేయించారట.

అయితే 18-30 సంవత్సరాలు కలిగిన వారిలో పవన్ కు 60శాతం మంది మద్దతు తెలిపారట. అలాగే పవన్ పుంజుకుని అధికారం చేపడుతారని విశ్వాసం వ్యక్తం చేశారని సర్వేలో తేలిందట. ఇక 30-45 సంవత్సరాలు కలిగిన వారు 30శాతం మంది పవన్ కు మద్దతు ప్రకటించారట. పవన్ రాజకీయాలో రాణించడం కత్తిమీద సామే అని మరికొందరు చెప్పారట. 45 సంవత్సరాలు పైబడిన వారు 10 శాతం మంది మద్దతు తెలిపి సినిమా వాళ్లను నమ్మలేం అని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారట. గ్రామీణ-పట్టణ ప్రాంతాల వారు హీరోగా అభిమానం చూపించారట కానీ రాజకీయంగా చెప్పలేం అన్నారని అంతర్గత సర్వేలో తేలిందట.

పార్టీ అంతర్గత సర్వే రిపోర్టుతో పవన్ లో కలవరం మొదలైనట్టు తెలుస్తుంది. చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సిద్దంగా లేమంటూ ప్రకటించడంతో ఏపీలో ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అని స్పష్టమవుతుంది.దీంతో  ఎన్నికలకు ఇంకా ఎనిమిది, తొమ్మిది నెలల సమయం ఉంది. ఈ లోపు లోపాలన్ని అధిగమించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయవచ్చని కీలక నేతలు పవన్ కు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పవన్ కూడా పార్టీ బలోపేతంతోపాటు ఇంకా అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టనున్నట్టు జనసేన నేతల ద్వారా తెలుస్తుంది.

మొత్తానికి జనసేనానిలో రాజకీయ కలవరం మొదలైంది. 2019లో అధికారం దిశగా అడుగులు వేయాలంటే ఏ విధమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని పలువురు సీనియర్  నేతలు, మేధావులతో పవన్ చర్చించారట. పవన్ తన రాజకీయ కలవరాన్ని పోగొట్టుకోవడానికి ఎటువంటి ఎత్తుగడ వేయనున్నారో….