జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.. ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులేవీ అంగీకరించే పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోరితే, పవన్ కళ్యాణ్ ఒప్పుకోకుండా వుంటారా.? ఛాన్సే లేదు.
ఎలా పవన్ కళ్యాణ్‌కి సమయం కుదురుతుందో అలా ప్లాన్ చేసి, సినిమా పూర్తి చేయగల సమర్థత త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర వుంది. త్రివిక్రమ్ దర్శకత్వం చేయాల్సిన అవసరం లేదు, ఎవరో ఓ దర్శకుడ్ని పెట్టి, తెరవెనుకాల ‘కథ’ నడిపించగలడు త్రివిక్రమ్.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, స్వీయ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కోసం ఓ ప్రాజెక్టుని సెట్ చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్‌కి ఇప్పటికే ఈ విషయమై త్రివిక్రమ్ చూచాయిగా సమాచారం అందించాడని అంటున్నారు.
జనసేన పోటీ చేస్తున్నది తక్కువ నియోజకవర్గాల కావడం, సీఎం రేసులో ఆయన దాదాపు లేకపోవడంతో, ఎన్నికలయ్యాక, పవన్ కళ్యాణ్‌కి రాజకీయాల్లో ఒకింత తీరిక బాగానే దొరకొచ్చు.
ఎమ్మెల్యేగా వుండీ, నందమూరి బాలకృష్ణ సినిమాలు చేస్తున్నట్లే, రేప్పొద్దున్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాక కూడా సినిమాలు చేయడానికి ఎలాంటి ఇబ్బందీ వుండదు. ఇవన్నీ లెక్కలేసుకునే, త్రివిక్రమ్ అన్నీ డిజైన్ చేస్తున్నాడట.
ఎన్నికలు పూర్తయిన వెంటనే, పవన్ కళ్యాణ్‌తో ప్రాజెక్టుని త్రివిక్రమ్ శ్రీనివాస్ అనౌన్స్ చేసే అవకాశం వుంది.