ఈరోజు మహానటి సావిత్రి 82వ జయంతి
నటిగా శ్రీమతి సావిత్రి ముద్ర తెలుగు సినిమా మీద ఎప్పటికీ చెరిగిపోదు . చిన్నప్పుడు నాటకాల్లో నటించిన సావిత్రి 1950లో సంసారం చిత్రంలో మంచి పాత్రలో అవకాశం వచ్చి కూడా చేజారి పోయింది. అదే సినిమాలో చిన్న పాత్రలో నటించాల్చిన పరిస్థితులు వచ్చాయి . ఆ తరువాత రూపవతి, పాతాళ భైరవి సినిమాల్లో కూడా చిన్న పాత్రల్లోనే కని పించింది .
పెళ్లిచేసి చూడు సినిమాతో ఆమె హీరోయిన్ అయ్యింది . అక్కడ నుంచి సావిత్రి సినిమా జీవితం మొదలైంది . 1953లో తన 17 సంవత్సరాల వయసులో దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర ధరించింది . దేవదాసు తండ్రి కాదన్న తరువాత తన వయసు వున్న పిల్లలున్న ఓ ముసలివాడిని వివాహం చేసుకునే పాత్ర. . నిజానికి 17 ఏళ్ల అమ్మాయి అలాంటి పాత్రను ధరించి మెప్పించడం సామాన్యమైన విషయం కాదు . అయితే ఆ తరువాత తనని ఎవరు సినిమా రంగానికి తీసుకొచ్చాడో ఆ పెద్ద నాన్నతో వచ్చిన మనస్పర్ధలు ఆమెను జెమినీ గణేశంతో వివాహానికి ప్రేరేపించాయి . ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని విషాద మయం చేసింది .
1979వ సంవత్సరం జులై 5 హైద్రాబాద్లో కిన్నెర ఆర్ట్స్ వారు నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు నేతృత్వంలో ఘన సన్మానం చేయడానికి పిలిపించారు . శ్రీమతి సావిత్రి హైదరాబాద్ మద్రాస్ నుంచి వచ్చి హోటల్ అశోకలో దిగారు . ఆరోజు ఉదయం శ్రీమతి సావిత్రితో నేను చేసిన ఇంటర్వ్యూ ఇది
“సావిత్రి గారు నటీనటుల జీవితాల పై వారు నటించిన పాత్రల ప్రభావం ఉంటుందని అంటారు . నిజమేనా ?”
“అక్షరాలా నిజం . అందుకు నా జీవితమే నిదర్శనం . నేను సినిమా రంగంలో ప్రవేశించిన తోలి రోజుల్లోనే బరువైన పాత్రలు , విషాద భరితమైనవి పోషించాను . నా వయసుకు మించిన పాత్రలవి . ఇంటికి వెళ్లిన తరువాత వాటి ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు .”
“మీ జీవితానికి పాత్రల ప్రభావానికి సంబంధం ఉందని నిజంగానే మీరు భావిస్తున్నారా ?”
“అవును .అందుకు సందేహం లేదు . ఆ పాత్రల ప్రభావం వల్లనే నా జీవితం కూడా విషాద మయం అయ్యిందని నేను నమ్ముతాను . నాకు మానవ శక్తి కన్నా దైవ శక్తి మీదనే నమ్మకం “
” మీ మంచితనమే … మీ ఈ స్థితికి కారణమనే దానితో ఏకీభవిస్తారా ?”
“ఆర్టిస్టులు సహజంగానే సున్నితంగా వుంటారు . అందులో నేను మరీ సెన్సిటివ్ . జీవితం ఎలా జరుగుతుందో ముందే రాసి పెట్టి ఉంటారని అంటారు . అందుకే మన ప్రమేయం లేకుండా అన్నీ జరుగుతూ ఉంటాయి . జరిగిపోయిన దాన్ని గురించి బాధ పడితే మాత్రం తిరిగి వస్తుందా ? నేను ఒకటిన్నర సంవత్సరం పాటు నటించలేదు . దానికి ఎన్నో కారణాలు . మానవ జీవితమే పెద్ద విషాదం . అందులో నేను ఓ చిన్న పాత్రధారినిని అనుకుంటా . అందుకే జరగ బోయే జీవితం గురించి జాగ్రత్త పడాలనుకుంటున్నా .”
‘మీ జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ?”
“ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది , మరోసారి ఆనందం అనిపిస్తుంది . చాలా సందర్భాల్లో విషాదం ఆవరిస్తుంది . అయితే జరిగిన ప్రతిదానికీ నాదే భాద్యత , ఇందుకు నేను ఎవరినీ నిందించను . మీకు ఓ విషయం చెప్పనా ? ఆర్టిస్టు అన్నాక అప్పటికప్పుడు ఆనందం పలికించాలి , మరు క్షణంలో విషాదం చూపించాలి . కాబట్టి ఆర్టిస్టు ఆనందమైనా , విషాదమైన తెర మీద పండించినప్పుడు .. జీవితంలో ఎదురయ్యే వాటిని మాత్రం సమంగా ఎందుకు స్వీకరించకూడదు ?”
“నటిగా మీకు బాగా సంతృప్తి నిచ్చిన సినిమాలు ఏవి ?”
“నేను తెలుగు, తమిళ ,కన్నడ మలయాళ భాషల్లో 300 చిత్రాల్లో నటించాను .అయితే మనసుకు బాగా నచ్చిన సినిమాలు గా చెప్పాలంటే , దేవదాసు , తోడికోడళ్లు , మిస్సమ్మ , గుండమ్మ కథ, మాయా బజార్ , కోడలు దిద్దిన కాపురం, అర్ధాంగి , మాంగల్య బలం ,పాండవ వనవాసం చిత్రాలను చెప్పుకోవచ్చు “
“మీరు దర్శకురాలు గా మారడానికి కారణం ఏమైనా ఉందా ?”
“దర్శకత్వం అనేది సృజనాత్మకమైనది . నాకు చాలా కాలంగా దర్శకత్వం చెయ్యాలనే కోరిక ఉండేది . తెలుగులో మాతృదేవత , చిన్నారి పాపలు , చిరంజీవి , తమిళంలో ప్రాప్తం (మూగ మనసులు ) కకుండై ఉళ్ళం (చిన్నారి పాపలు ) చిత్రాలు నా అభిరుచికి తగ్గట్టు తీశాను
“నటిగా మీరు మర్చిపోలేని సంఘటలు ఏమైనా వున్నాయా?”
“చాలా వున్నాయి . అయితే నన్ను మొదట్లో నటిగా పనికి రావు పొమ్మన్నారు , అవమానించారు , వెనుక అవహేళన కూడా చేశారు . .నటనే తెలియదని అన్నారు . అలా అన్న వారే ఈరోజు నన్ను మహా నటి అని కీర్తిస్తున్నారు .
ఈ పాత్ర అయినా సరే సావిత్రి ధరించాలి అంటున్నారు . అలాంటి వారిని చూసి జాలి పడతాను, నవ్వుకుంటాను . నేను చాలా మొండిదాన్ని . నాకు వచ్చిన ప్రతి పాత్ర సమర్ధవంతంగా నటించాలి విశ్వ ప్రయత్నం చేసేదాన్ని . మనసులో వున్నా భావం ముఖంలో కనిపించేదాకా పట్టు వదిలేదాన్ని కాదు . అలాంటి కఠోర శ్రమ వల్లనే నేను ఏ పాత్రనైనా ధరించగలుగుతున్నా . “
ఇవి సావిత్రి ఇంటర్వ్యూ లోని కొంత భాగం మాత్రమే . సావిత్రి ఆటారువాత కొంత కాలానికే బెంగళూరు వెళ్లి కోమాలోకి వెళ్లారు . 19 నెలల పాటు మృత్యువుతో పోరాడి 26 డిసెంబర్ 1981లో భౌతికంగా మనకు దూరమయ్యారు . ఆమె నటించిన సినిమాలు వున్నత వరకు చిరంజీవిగానే వుంటారు .
– భగీరథ