రజినీకాంత్ ఆఖరు సినిమా ఇదే

రజినీకాంత్ అభిమానులంతా ఎప్పుడు తలైవా పూర్తిస్థాయి రాజకీయాల్లో అడుగు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. కానీ రజినీకాంత్ కి మాత్రం ఒకదాని తర్వాత మరొకటిగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ మేరకు ఒక వార్త బయటకు వచ్చింది. త్వరలో ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాలో రజిని నటించనున్నారట. అదే ఆయన ఆఖరి సినిమా అవబోతుందని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

అయితే గత ఏడాది డిసెంబర్ 31 వ తేదీన త్వరలో తాను సొంత పార్టీ పెడతాను అని, తమిళ నూతన సంవత్సరం రోజున పార్టీ పేరు, జెండాని అనౌన్స్ చేయనున్నట్లు పబ్లిక్ గా ప్రకటించారు రజినీకాంత్. కానీ కాలా రిలీజ్ టైములో ఇంకా టైం రాలేదు వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాను అని అభిమానుల్ని నిరాశ పరిచారు.

తాజాగా ఈ సూపర్ స్టార్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సైఫై యాక్షన్ థ్రిల్లర్ 2.0 లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. లైకా ప్రొడక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

దీనితోపాటు ప్రస్తుతం తలైవా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తున్న తలైవర్ 165 లో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, బాబీ సింహ ముఖ్య తారాగణం.

ఈమధ్యకాలంలో తలైవా హిట్ కమర్షియల్ డైరెక్టర్ కే.ఎస్.రవికుమార్ ని కలిసినట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ముత్తు, పడయప్ప, లింగా సినిమాల తర్వాత మరో సినిమా చేయటం కోసం వీరిద్దరూ కలిసినట్టు టాక్ వినబడుతోంది.

కానీ కొన్ని కధనాల ప్రకారం తలైవర్ 165 తర్వాత రజినీకాంత్ ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాలో కనిపించనున్నాడు. అయితే ఇదే రజినీకాంత్ నటించే ఆఖరి సినిమా అని తెలుస్తోంది. దీని తర్వాత తలైవా పూర్తిగా రాజకీయాలపైన దృష్టి సారించనున్నారట.