‘యన్‌.టీ.ఆర్‌’ఆడియో లాంచ్: ఎన్టీఆర్ స్పీచ్ పై బాలయ్య

బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు పాత్రలో నటిస్తూ, ఎన్‌.బి.కె ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న సినిమాలు‘ఎన్టీఆర్‌ కథా నాయకుడు’, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’. క్రిష్‌ దర్శకుడు. సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్‌ ఇందూరి సహనిర్మాతలు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చారు. హైదరాబాద్‌లో పాటలు, ట్రైలర్‌ విడుదల అయ్యాయి. ఈ ఈవెంట్ కు జూ. ఎన్టీఆర్ సైతం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమోషనల్ గా మాట్లాడారు.

జూ. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘బాబాయ్‌ పక్కన నిలబడితే పెద్దాయన గుర్తుకొస్తున్నారు. ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక వ్యక్తినే అనేది ఎంతో గర్వకారణం. ఆయన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ, ప్రతి ఇంటికీ చెందిన ఒక ధృవతార. తెలుగువాళ్లు అని కూడా మనల్ని సంబోధించని రోజుల్లో ఇదిరా తెలుగువాడి గౌరవం, ఇదిరా తెలుగువాడి పౌరుషం అని చెప్పుకొంటున్నామంటే దానివెనక ఎంతోమంది త్యాగాలు చేశారు.


చిన్నతనంలో తాతయ్య అని పిలిచేవాడిని. ఆయన గురించి తెల్సుకునే కొద్దీ అన్నగారు నందమూరి తారక రామారావు అని పిలిచేవాడిని. వాల్మీకిని అడిగారేమో భూమ్మీద ధర్మం మూర్తీభవించిన వ్యక్తి లేడా అని వాల్మీకిని ఎవరైనా అడిగి ఉంటారు. ఎందుకు లేదు అదిగో శ్రీరామ చంద్రుడు అని వాల్మీకి రామాయణం రాశారు. ఆ తర్వాత తెలుగువారిలో అదే ప్రశ్న మొదలైంది ఏమో.. అలాంటి ధర్మ మూర్తి మళ్ళీ పుట్టడా అని.. ఆ ప్రశ్నలో నుంచి, శ్రీరామ చంద్రుడి కటాక్షంతో 1928 మే 28న ఒక ధృవ తార జన్మించింది.

కనీసం మనల్ని తెలుగువారు అని కూడా పిలవని రోజుల్లో.. ఇందిరా తెలుగువాడి గౌరవం, తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి ఖ్యాతి అని తొడగొట్టి చెప్పుకుంటున్నాం అంటే అందుకు కారణం ఎందరో మహానుభావుల త్యాగాలు. అందులో నందమూరి తారకరామారావు గారు ప్రముఖులు. మా పిల్లలు అడిగితే అలాంటి వ్యక్తి ఇంకా ఉన్నారా అని మా పిల్లలు అడిగితే ఇంకా పుట్టలేదు అని చెబుతా. కానీ మా తాత గురించి మీ తాత చేసిన చిత్రం ఉంది అని చూపించుకుంటా.

 ఆ మహానుభావుడి చరిత్ర మా తర్వాత తరానికి కూడా తీసుకెళుతున్నందుకు బాబాయ్‌ని ఎలా అభినందించాలో తెలియదు. చరిత్రకి విజయాలు, అపజయాలూ ఉండవు. చరిత్ర సృష్టించడం ఒక్కటే ఉంటుంది’’ అన్నారు.

ఇక ఎన్టీఆర్ ఇంత ఎమోషనల్ మాట్లాడతారని ఊహించని బాలయ్య చాలా ఆనందపడ్డారట. ఈ వెంట్ అయ్యాక పర్శనల్ గా ఫోన్ చేసి మరీ అభినందించారట. ఎన్టీఆర్ స్పీచ్ ..పంక్షన్ కు ఓ లుక్ తెచ్చిందని కళ్యాణ్ రామ్ కు, క్రిష్ కు చెప్పారని తెలుస్తోంది.

ఈ వేడుకలో చిత్ర హీరో బాలకృష్ణ, హీరోయిన్‌ విద్యాబాలన్, దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. వీరితో పాటు నటీనటులు జమున, గీతాంజలి, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్, సుమంత్, రానా, తారకరత్న, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రణీత, దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అనిల్‌ రావిపూడి, ‘కళాబంధు’ టి.సుబ్బరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, నాజర్, నరేశ్‌లతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.