Takkar Movie Review : ‘టక్కర్’ మూవీ రివ్యూ & రేటింగ్…

(చిత్రం : టక్కర్, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ : రేటింగ్ : 1.75/5, దర్శకత్వం : కార్తీక్ జి. క్రిష్, నటీనటులు : సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, యోగిబాబు, అభిమన్యు సింగ్, మునీష్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్, సుజాత శివకుమార్ తదితరులు. సంగీతం : నివాస్ కె. ప్రసన్న, సినిమాటో గ్రఫీ : వాంచి నాథన్ మురుగేశన్, ఎడిటింగ్ : జి. గౌతమ్, రచన : శ్రీనివాస్ కవినయం-కార్తీక్ జి. క్రిష్, నిర్మాత : సుధాన్ సుందరమ్-జి. జయరామ్)

యువతరం క్రేజీ హీరో సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. అతడి పేరు వినగానే మనకు బాగా గుర్తుకు వచ్చే సినిమాలు ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ఈ రెండు సినిమాలు కథ, కథనాల విషయంలో హీరో, హీరోయిన్ల నటనతో అప్పట్లో యువతరాన్ని కట్టిపడేశాయి. ఆ సినిమాలు ఇప్పటికీ యువతను అంతే అలరిస్తున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతే కాదు.. ఆ సినిమాలు సిద్ధార్థ్ ని యంగ్ అండ్ డైనమిక్, చలాకీ హీరోని చేశాయి. ఆయా చిత్రాల ద్వారా అతడు ఏర్పరచుకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇలా పలు విజయవంతమైన సినిమాలతో తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్న సిద్దార్థ్ అలా వచ్చిన ఇమేజ్ తో మరిన్ని చిత్రాల ద్వారా మంచి విజయాలను చవిచూస్తాడని అందరూ ఊహించారు. అయితే.. వారి ఊహలు తలకిందులయ్యాయి. వరుస పరాజయాలు అతడిని వెక్కిరించాయి. కెరీర్ గాడి తప్పింది. ఫలితంగా ఇటు తెలుగు, అటు తమిళంలో పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఎంతగానో నిరాశపడ్డాడు. ఎలాగైనా టాలీవుడ్ లో పూర్వవైభం సంపాదించుకోవాలని కలలుగన్నాడు. అలనాటి ఇమేజ్ కోసమే అతడిప్పుడు తహతహలాడి పోతున్నాడు. ఆ మధ్య ఎన్నో ఆశలతో ‘మహాసముద్రం’ అంటూ మళ్లీ వెలుగుకోసం రీఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు ఏ మాత్రం ఆదరించలేదు. ఆ సినిమా సైతం అతడి ఆశలమీద నీళ్లు చల్లింది. అసలు సిద్ధార్థ్ నటించిన అలాంటి సినిమా ఒకటి వచ్చిందన్న విషయం కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ మరోసారి తననుతాను నిరూపించుకోవాలని ఆరాటపడ్డాడు. ఆ ఆరాటంలో భాగంగానే తాజాగా తమిళంలో నటించిన ‘టక్కర్’ తెలుగులో అనువాదమై ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించి విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించి, అంచనాలను పెంచేశాయి. మరి ఎన్నో ఆశలూ.. అంచనాల మధ్య 9 జూన్, 2023న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ ‘టక్కర్’ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? హీరో సిద్ధార్థ్ కలను నిజం చేసిందా? అతడికి ఈ చిత్రం ద్వారా పూర్వ వైభవం లభించిందా? కెరీర్ లో నిలదొక్కుకునేందుకు హిట్ ట్రాక్ లో పడ్డాడా? లేదా? తెలుసుకుందాం..

కథ : అనగనగా ఓ పేదింటి కుర్రాడు. పేరు గుణశేఖర్ (సిద్ధార్థ్). బాగా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకుంటాడు. అందుకోసం పుట్టిన ఊరును సైతం వదిలి వైజాగ్ వస్తాడు. అలా వచ్చిన అతడు రకరకాల ఉద్యోగాల్లో చేరతాడు. తనుకున్న కోపం వల్ల ఎక్కడా ఇమిడలేకపోతాడు. ఆ ఉద్యోగాలు అతడిని సంతృప్తిపరచకలేకపోతాయి. ఇక లాభం లేదనుకుని ఓ బెంజ్ కారు టాక్సీ డ్రైవర్ గా అవతారం ఎత్తుతాడు. టాక్సీ నడుపుతున్న క్రమంలో ఓ రోజు కారు యాక్సిడెంటుకు గురవుతుంది. కారు పూర్తిగా దెబ్బ తింటుంది. దాంతో కారు యజమానితో చివాట్లు తప్పవు. ఛీ..ఇదేం ఖర్మరా బాబోయ్.. అంటూ నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు కూడా అతడికి ధైర్యం సరిపోదు. రౌడీల దగ్గరికి వెళితే.. వాళ్లే చంపేస్తారని అనుకుంటాడు. అయితే.. సీన్ పూర్తిగా మారిపోతుంది. ఆ రౌడీలను కొట్టి వారి వద్ద ఉన్న కారును తీసుకొని అక్కడినుంచి పారిపోతాడు. అక్కడితో కథ సుఖాంతం అవుతుందనుకుంటే పొరపాటే! అదే కారు డిక్కీలో రౌడీలు కిడ్నాప్ చేసిన ఓ అమ్మాయి ఉంటుంది. అంతే ఒక్కసారిగా అతడి బుర్ర గిర్రున తిరుగుతుంది. ఏం చేయాలో అర్థం కాదు.. ఇంతకీ కారు డిక్కీలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? తనని ఆ రౌడీలు ఎందుకు కిడ్నాప్ చేశారు? ఓ పేదింటి కుర్రాడు కోటీశ్వరుడు అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో ఓ అమ్మాయి అతడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? వారిద్దరూ కలిసి చేసిన ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? అన్నది సినిమా కథాంశం.

విశ్లేషణ: పరమరోటీన్ గా సాగిన ఈ కథలో ఎక్కడా ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సన్నివేశాలు అస్సలు కనిపించవు. దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ కథ, కథనాల విషయంలో పూర్తిగా తడబడ్డాడు. హీరో సిద్ధార్థ్ ఎన్నో ఆశలతో నటించిన ఈ పసలేని కథ ఆసక్తికరంగా సాగక నీరుగారిపోయింది. దర్శకుడు అసలు సిద్ధు గెటప్ తోనే ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంటును దూరం చేశాడు. హీరో కోటీశ్వరుడు అవ్వాలన్న లక్ష్యంతో వైజాగ్ రావడం.. టాక్సీ డ్రైవర్ గా చేయడం.. ఈ ప్రయాణంలో రకరకాల అవమానాలు ఇలా కథ అంతా నీరసంగానే సాగుతుంది. ప్రథమార్ధం కు విరామమిచ్చిన తీరు ఎవ్వరినీ ఆకట్టుకోదు. ఇక ద్వీతీయార్ధం గురించి అయితే చెప్పుకోకపోవడమే బెటర్! అంతా పరమ బోరింగుగా సాగి.. ఒకదశలో పేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఏదో సాధించి ఎత్తుకు ఎదగాలన్న హీరోను ఆత్మహత్య చేసుకునే పిరికివాడిగా చూపించటంలోనే దర్శకుడు తనేం చెప్పదలచుకున్నాడో అది పూర్తిగా కొరవడినట్లయింది. నాయకానాయికలు కలిసి ఎలా ప్రయాణం చేశారు? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? వీళ్ళిద్దర్నీ పట్టుకునేందుకు రాజ్ తన గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఆ గ్యాంగ్ నుంచి ఈ జంట ఎలా తప్పించుకుందిలాంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమలతో అస్సలు ఏమాత్రం ఫీల్ కనిపించకపోగా.. విసిగిస్తుంది. అయితే.. ఈ ప్రయాణం బాగానే ఉంది కానీ.. దర్శకుడు కథనంలో మేళవించలేకపోయాడు. పూర్తిగా విఫలమయ్యాడు. ప్రథమార్థంలో కాస్తంత కాలక్షేపాన్ని ఇచ్చిన ఈ చిత్రం చివరివరకూ ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెడుతుంది. చావడానికి ధైర్యంలేని హీరో రౌడీల వద్దకు వెళ్లి చావాలనుకోవడం.. వెంటనే వారి మీద తిరగబడి చితక బాధేయడం ఏంటో ఓ పట్టాన అర్ధం కాదు. కిడ్నాప్ అయిన హీరోయిన్ తో ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి కాకుండానే వారి శోభనం దరిద్రపు టేకింగుకి పరాకాష్ట!

ఎవరెలా చేశారంటే…గుణశేఖర్ పాత్రలో సిద్దార్థ్ అదరగొట్టాడనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన భుజాల పై వేసుకుని ముందుకి తీసుకెళ్లాడు. ఒక బీద యువకుడి కష్టాలు, జీవితంలో పడే ఆవేదన దానివలన ఎలాగైనా ఎదగాలనే కాంక్ష గల యువకుడి పాత్రలో ఎంతో సహజంగా నటించి అలరించాడు. అయితే.. తన లుక్ మాత్రం పెద్దగా ఆకట్టుకోదు. ‘టక్కర్’ థియేటర్లలో అడుగు పెట్టిన కాసేపటికి ప్రేక్షకులకు ఓ సందేహం వస్తుంది. ‘అసలు సిద్ధార్థ్ ఈ కథను ఎలా అంగీకరించారు?’ అని! ‘ఆ లుక్ ఎలా ఓకే చేశారు?’ అని! ప్రయోగాలు చేయడంలో తప్పు లేదు. సిద్ధార్థ్ ఇమేజ్ ముందు మీసాలు తీసేసి, పిల్లి గడ్డం పెట్టుకున్న ఆ లుక్ యాక్సెప్ట్ చేసేలా లేదు. కథలో ‘ఆవారా’ ఛాయలు ఎక్కువ కనిపించాయి. అటు యాక్షన్, ఇటు రొమాన్స్, మధ్యలో కామెడీ… ఏదీ సరిగా లేదు. సినిమాలో యాక్షన్ పాళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ సీన్లతో పాటు.. అడల్ట్ కంటెంట్ కి కూడా కొదవలేదు. హీరోయిన్ తో కలిసి బెడ్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాలలో సిద్దార్థ్ రెచ్చిపోయి నటించాడు. ఆమెతో సిద్దార్థ్ బోల్డ్ సన్నివేశాలు సెగలు పుట్టిస్తాయి.హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ చూడటానికి బాగున్నా ఆ పాత్రలో ఎలాంటి వైవిధ్యం లేకపోవడంతో పూర్తిగా తేలిపోయింది. విలన్ పాత్రలో నటించిన అభిమన్యు సింగ్ పాత్ర పూర్తిగా వేస్ట్ అని చెప్పాలి. ఆ పాత్ర మరీ డమ్మీగా కనిపిస్తుంది. అటువంటి నటుడికి తగ్గ పాత్ర ఇవ్వలేదు. కామెడీ పాత్రలో యోగిబాబు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు.

సాంకేతిక అంశాల విషయానికొస్తే…చెప్పుకోవడానికి ఏం లేదు. సంగీతం పూర్తిగా గాడి తప్పిపోయింది. పాటలైతే ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా సాగలేదు. ఎడిటింగ్ ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ అయితే తన పని తాను బాగానే చేకుంటూ వెళ్ళింది. నిర్మాణ విలువలు ఓకే. వరుస సినిమాలతో మంచి జోరు మీదున్న పీపుల్స్ మీడియా ఈ నాసిరకం సినిమాని ఎందుకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిందో వారికే తెలియాలి. కథ, కథనం, దర్శకత్వం, సిద్ధార్థ్ లుక్ , పాటలు ఇలా అన్నీ ఒకటిని మించి ఒకటి చిత్రానికి మైనస్ గా నిలిచాయి. సిద్ధార్థ్ కెరీర్‌లో ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ, ప్రేక్షకుల్లో అతడి ఇమేజ్ డామేజ్ చేసే సినిమాలు లేవని చెప్పాలి. ఆ లోటు ‘టక్కర్’ భర్తీ చేసేలా ఉంది. ఈ సినిమా ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా నిలిచింది. మొత్తం మీద చెప్పాలంటే ‘టక్కర్’.. ఓ రెండు గంటల టార్చర్! అంటూ సినిమా చూసిన ప్రేక్షకుడు పూర్తి నిరుత్సాహంతో థియేటర్ నుంచి ‘దేవుడా..’ అంటూ బయటికి వస్తాడు!