టిఆర్ఎస్ నేత దారుణ హత్య (వీడియో)

వికారాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. పరిగి మండలం సుల్తాన్ పూర్ లో కాంగ్రెస్ , టిఆర్ ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది.

సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన ఫిరంగి నారాయణ రెడ్డి గతంలో నార్ మ్యాక్స్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సమయంలోనే నారాయణ రెడ్డికి, గ్రామంలోని కొంతమంది యువకులతో పంచాయతీ జరిగింది. కొంత మంది నారాయణ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య వైరం మరింత పెరిగింది.

సోమవారం గ్రామంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు గొడవ జరిగింది. పలువురు సర్ది చెప్పటంతో గొడవ సద్దు మణిగింది. మంగళవారం ఉదయం సైకిల్ పై పొలానికి వెళ్తున్న నారాయణరెడ్డి పై గ్రామానికి చెందిన కొందరు యువకులు కర్రలు, కత్తులతో  దాడి చేశారు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో నారాయణ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయం పూట బావుల దగ్గర కావడంతో నారాయణ రెడ్డి సహాయం కోసం అరిచినా పట్టించుకున్నవారు లేరని తెలిసింది.  వీడియో కింద ఉంది చూడండి.  

 

మరోవైపు నారాయణ‌రెడ్డి హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణరెడ్డి అనుచరులు కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి గొడవలు జరుగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఈ హత్యలో ఎవరూ పాల్గొన్నారనే దాని పై పోలీసులు విచారిస్తున్నారు. ఇది కాంగ్రెస్  వార చేసిన హత్యగా అంతా భావిస్తున్నారు. కానీ దీనిని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. రాజకీయంగా గొడవలు ఉన్నా నారాయణ రెడ్డిని హత్య చేసేంత ఉద్దేశ్యం తమకు లేదని వారు తెలిపారు. 

నారాయణ రెడ్డి హత్య పై పోలీసులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత గొడవలు ఉన్న వారు హత్య చేసి పార్టీల గొడవగా చిత్రీకరించాలని చూశారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఏదైమైనా గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కీలక నాయకుల ఇంటి దగ్గర సెక్యూరిటి పెట్టారు. 

మరో వైపు టిఆర్ఎస్ కీలక నేతలతో పాటు మంత్రి మహేందర్ రెడ్డి, కేటిఆర్ గ్రామానికి రానున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులు కూడా భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, రేవంత్ రెడ్డి గ్రామానికి రానున్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలంతా సంయమనం పాటించాలని ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు.