మలయాళ సినిమాల హవా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మలయాళ సినిమాల హవా నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది వచ్చిన ప్రేమలు, మంజుమ్మెల్‌ బాయ్స్‌, భ్రమయుగం తెలుగులో మంచి కలెక్షన్లు సాధించాయి. చిన్న కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాలు కేవలం మలయాళ ప్రేక్షకులనే కాదు..అందర్నీ మెప్పిస్తున్నాయి. అందుకే మనవాళ్లు మలయాళ సినిమాలను రీమేక్‌ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన మరో సినిమా తెలుగు ఓటీటీలోకి రాబోతుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ టైంలో మలయాళంలో వచ్చిన చిత్రం నయట్టు. 2021లో కరోనా వలన థియేటర్‌లు మూసి ఉండడంతో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ప్లిక్స్‌లో నేరుగా విడుదలై మంచి హిట్‌ అందుకుంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాను తెలుగులో కోటా బొమ్మాళిఅంటూ రీమేక్‌ చేశారు. అయితే కోటా బొమ్మాళి ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్టీమ్రింగ్‌ అవుతుండగా.. ఒరిజినల్‌ వెర్షన్‌ నయట్టును మళ్లీ తెలుగులోకి తీసుకువస్తుంది ఆహా.

ఈ సినిమాను చుండూరు పోలీస్‌ స్టేషన్‌ అనే పేరుతో తీసుకువస్తుంది. ఏప్రిల్‌ 26 నుంచి ఆహాలో ఈ సినిమా స్టీమ్రింగ్‌ కానున్నట్లు ప్రకటించింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. తాము చేయని హత్య కేసులో ముగ్గురు పోలీసు అధికారులు చిక్కుకుంటారు.ఈ కేసు నుంచి వాళ్లు బయటపడతారా? లేదా? చివరకు వాళ్ల జీవితం ఎలా మారింది? అనే కథాంశం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. కుంచాకో బోబన్‌, జోజు జార్జ్‌, నిమిషా సజయన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మార్టిన్‌ ప్రక్కత్‌ దర్శకత్వం వహించాడు.