కేంద్ర బలగాల రక్షణ కావాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టు మెట్కెక్కారు. తనకు తెలంగాణ ప్రభుత్వం కల్పించే రక్షణ విషయంలో నమ్మకం లేదని ఆయన హైకోర్టుకు విన్నవించుకున్నారు. రేవంత్ రెడ్డి నిన్న హైకోర్టులో వేసిన పిటిషన్ ను బుధవారం ధర్మాసనం విచారించింది. 

రేవంత్ రెడ్డి అభ్యర్థనపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసును ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వివరణ ఆధారంగా రేవంత్ కు భద్రత విషయంలో స్పష్టత రానుంది.

కేంద్ర బలగాల భద్రతే ఎందుకు?

రేవంత్ రెడ్డి తన భద్రత విషయంలో ఇటీవల కాలంలో ఆందోళనతో ఉన్నారు. ఆయన ఇప్పటికే తనకు కేంద్ర బలగాల భద్రత విషయమై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి రజత్ కుమార్ ను కలిసి స్వయంగా విన్నవించారు. తన భద్రత విషయంలో తనకు, తన కుటుంబసభ్యులకు ఆందోళన ఉందని ఆయన రజత్ కుమార్ కు వివరించారు.

అయినప్పటికీ రజత్ కుమార్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి తెలంగాణ డిజిపిగా ఉన్నారు. ఆయన మీద తొలిరోజుల నుంచే రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. డిజిపి మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి లోపాయికారి మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించారు రేవంత్. అంతేకాకుండా నాగార్జున సాగర్ లో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొని మహేందర్ రెడ్డి ప్రసంగించారని చెబుతూ వచ్చారు. ఇక కేసిఆర్ మీద ఉన్న పాత కేసులు మహేందర్ రెడ్డే క్లోజ్ చేయించాడని, అందుకే మహేందర్ రెడ్డిని డిజిపిగా అపాయింట్ చేశారన్న ఆరోపణలు కూడా రేవంత్ చేస్తూ ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ కనుసన్నల్లో పనిచేసే పోలీస్ బాస్ ఇచ్చే సెక్యూరిటీ పట్ల తనకు నమ్మకం లేదన్నారు. దానికితోడు తెలంగాణ అసెంబ్లీలో సిఎం కేసిఆర్ ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తా అని రేవంత్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు. అలాగే రేవంత్ కు దేహశుద్ధి చేస్తామంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపి బాల్క సుమన్ లాంటివారి స్టేట్ మెంట్లను కూడా ఉదహరిస్తున్నారు. 

కేంద్ర బలగాల రక్షణ జరిగే పనేనా ?

కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని రేవంత్ కోరడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. సాధారణంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఏ నాయకుడు కూడా కేంద్ర బలగాల రక్షణ కోరలేదు. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 14 ఏండ్ల తర్వాత పాత కేసును రీఓపెన్ చేసి సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని అరెస్టు చేసిన పరిస్థితి ఉంది. 

అంతేకాకుండా తెలంగాణ జెఎసి ఛైర్మన్ గా ఉన్న రోజుల్లో కోదండరాం ఇంట్లోంచి బయట కాలు పెడితే అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తప్పించిన పరిస్థితులున్నాయి. కోదండరాం ను ఒకసారైతే అర్ధరాత్రి తన ఇంటి మీద పోలీసులు దాడి చేసి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి ఆయనను అరెస్టు చేశారు. ఒక ప్రజా ఉద్యమ కారుడిగా గుర్తింపు పొందిన కోదండరాం ను చీమలా నలిచివేయాలని తెలంగాణ సర్కారు ప్రయత్నించిందనడానికి ఈ వ్యవహారాలే నిదర్శనం. తొలినాళ్లలోనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేందుకు ఏనాడూ మైక్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంతెందుకు రేవంత్ ఏం మాట్లాడకపోయినా సెషన్ల కొద్దీ ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసింది సర్కారు.

మరి హైకోర్టులో కేసు వేయడమంటే రేవంత్ పక్కా స్కెచ్ ప్రకారమే వ్యవహరిస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కేసు ద్వారా టిఆర్ఎస్ కు తెలంగాణలో పోలీసు బాస్ కు ఉన్న బంధాన్ని బయట పెట్టినట్లు అవుతుందని వారు చెబుతున్నారు. ఒకవేళ కేంద్ర బలగాల రక్షణ కల్పించినా కల్పించకపోయినా టిఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు దీన్నొక అస్త్రంగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరి కేంద్ర బలగాల రక్షణ అనేది సాధ్యేమేనా కాదా అన్నది హైకోర్టు తేల్చాల్సి ఉంది.