విశాఖకు రేవంత్… ఏపీ వాసుల సింగిల్ డిమాండ్ ఇదే!

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి విశాఖకు రానున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం హోదాలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తిరుపతి సభకు హాజరైన ఆయన.. ఈసారి జగన్ కలల రాజధాని విశాఖకు రానున్నారు. ఈ నెల 11వ తేదీన విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన డిమాడ్లు, ఆయనకు ఏపీ వాసుల నుంచి డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

అవును… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 11న విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు! ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ, ఇతర కాంగ్రెస్ నేతల అధ్వర్యంలో జరగనున్న ఈ సభను భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్న అన్ని సంఘాలనూ కలుపుకుని, ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

వాస్తవానికి గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయనే కామెంట్లు ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఈ పని పూర్తిచేస్తారని.. ముందు ఎన్నికలు ఉండటం వల్ల కేంద్రంలోని పెద్దలు సైలంటుగా ఉన్నట్లు కనిపిస్తున్నారని చెబుతున్నారు.

దీంతో ఈ విషయంపై తమ నిబద్దతను బలంగా చెప్పాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఏపీలో బీజేపీని దెబ్బకొట్టడమే కాకుండా.. తాము మద్దతు కూడగట్టుకోవడానికి ఇది అనువైన అంశం అని భావిస్తున్నారని తెలుస్తుంది. కారణం ఏదైనా కార్యం గొప్పది కావడంతో… విశాఖలో ఈ కాంగ్రెస్ సభకు పెద్ద ఎత్తున మద్దతు దొరికే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఆ సంగతి అలా ఉంటే… విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా, ఏపీ ప్రజల హక్కులను అనుకూలంగా జరగనున్న సభకు ముఖ్య అతిధిగా హాజరవుతున్న రేవంత్ కు ఏపీ ప్రజల నుంచి మరో రిక్వస్ట్ కం డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఇందులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సిన 6 వేల కోట్లను కూడా ఇప్పించాలని కోరుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ డిమాండ్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారా.. లేదా అనేది వేచి చూడాలి!