ఏపీలో కాంగ్రెస్ “నోటా” కాకూడదంటే… ఇదొక్కటే మార్గం!

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ మనుగడ కాపాడుకోవాలని పరితపిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఏపీలో పూర్వవైభవం రానప్పటికీ… మనుగడను మాత్రం ప్రశ్నార్థకం చేసుకోకూడదని భావిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిళకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టాణం. దీంతో ఏపీలో షర్మిళ ఎంట్రీ తర్వాత పార్టీలో కాస్త కదలికలు వచ్చాయని అంటున్నారు.

ఈ క్రమంలో వైసీపీ, టీడీపీలలో టిక్కెట్లు దక్కనివారికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫలితంగా పార్టీ పరంగానే కాకుండా… వ్యక్తుల ప్రతిభతో ఒకటి రెండు స్థానాల్లో అయినా హస్తం హవా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా… అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం సాధించగలిగితే అదే ఫస్ట్ & బిగ్ సక్సెస్ అని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ నెల 25న తిరుపతిలో భారీ బహిరంగ సభకు ప్లాన్స్ చేస్తుంది. ఈ సభను భారీఎత్తున చేపట్టాలని.. భారీ జనసమీకరణం చేయాలని.. అటు ప్రజలను, ఇటు మీడియానూ ఆకర్షించగలిగేలా, చర్చ జరిగేలా కండక్ట్ చేయాలని భావిస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లు హాజరవ్వబోతున్నారని తెలుస్తుంది.

ఏమాత్రం అవకాశం ఉన్నా… తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్నాణటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు కూడా హాజరవ్వొచ్చని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఈ వేదికపై నుంచి రేవంత్ రెడ్డి చేయబోయే ప్రసంగంపై తీవ్ర ఆసక్తి నెలకొంది! ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో… రేవంత్ రెడ్డి స్పీచ్ ఎలా ఉండబోతుంది.. కేవలం జగన్ లక్ష్యంగానే ఆయన విమర్శలు ఉండబోతున్నాయా.. లేక, చంద్రబాబుని కూడా టచ్ చేసే ఛాన్స్ ఉందా అనేది ఇక్కడ కీలకం కాబోతుంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించాలంటే… ఎవరొకరి పంచన చేరితే అది ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు! ఇటు ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఏ స్థాయిలో విమర్శలు గుప్పించడానికి అటు షర్మిళ, ఇటు రేవంత్ లు ఉత్సాహం చూపిస్తారో… అదే స్థాయిలో రాష్ట్ర విభజన అనంతరం సీనియారిటీ పేరు చెప్పి సీఎం అయిన చంద్రబాబునీ అదే స్థాయిలో నిలదీయాలి! అమరావతి పేరు చెప్పి గ్రాఫిక్స్ చూపించి.. ఏపీకి రాజధాని లేకుండా అవ్వడానికి పునాది వేసింది ఆయనే అనే విషయం జనాల్లోకి తీసుకెళ్లాలి.

ఇక జగన్ పై ఏ విమర్శలు చేయాలనేది అటు షర్మిళకు కానీ, ఇటు రేవంత్ కి కానీ చెప్పనవసరం లేదు. ప్రధానంగా రేవంత్ స్పీచ్ పై ఆసక్తి ఉండే అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి… చంద్రబాబుని తమలపాకుతో, జగన్ ను తలుపుచెక్కతో కొడతానంటే మాత్రం ఏటువంటి ప్రయోజనం ఉండదనే విషయం ఆయన గ్రహించాలి! లేదు… అలానే తన ప్రసంగ శైలి ఉంటుందని రేవంత్ ఫిక్స్ అయితే మాత్రం… ఏపీలో “నోటా”తో పోటీపడటం మినహా కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తి అని భావించే అవకాశాలు ఆల్ మోస్ట్ శూన్యం అని అంటున్నారు పరిశీలకులు.

పైగా ఇప్పటికే షర్మిళను చంద్రబాబు శ్రేయోభిలాషుల లిస్ట్ లో కలిపి వాయించేస్తుంది వైసీపీ. దత్తపుత్రుడు పవన్, ఉత్త పుత్రుడు లోకేష్, వదినమ్మ పురందేశ్వరి, చెల్లమ్మ షర్మిళ అంటూ వైసీపీ నేతలు.. కాంగ్రెస్ ను టీడీపీకి బీ టీం గా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమర్శలను జనం నమ్మకూడదంటే… తమళపాకు, తలుపు చెక్క స్టైల్ కుదరదు… ఇద్దరికీ తలుపుచెక్క తప్పదు! అలా కానిపక్షంలో కాంగ్రెస్ నేతలకు ఏపీలో పెద్ద పని ఉండదు!!