ఏడు మండలాలను తిరిగిచ్చేయండి : టిఆర్‌ఎస్ ఎంపీ వినోద్

పార్లమెంటులో అవిశ్వాసం సంధర్భంగా టిఆర్ ఎస్ ఎంపీ వినోద్ చర్చలో పాల్గొన్నారు. మోదీ సర్కార్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందన్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. ఆ ఏడు మండలాలను తిరిగి ఏపిలో కలిపేందుకు ప్రధాని మోదీ చొరవచూపారు. తిరిగి ఆ ఏడు మండలాలను తెలంగాణలో చేర్చే విధంగా సభలో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో ఏపి అడ్డంకులు సృష్టించినా దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టులలో కేసులు వేస్తున్నారని, దీనిపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం కోసం నిధులు కావాలని గల్లా జయదేవ్ కోరుతున్నారు. వారు అడిగిన నిధులు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని, తాము నీటి పంపకాలే గురించి మాత్రమే అడుగుతున్నామన్నారు. పోలవరానికి తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.