షాకింగ్ విషయాలు చెప్పిన అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్ వోల్డ్ సిటీ ఒక కుటుంబానికి జాగీరు. ఆ కుటుంబం ఒవైసీది. వ్యాపారాలు, విద్యాసంస్థలు,ఆసుపత్రులు, బ్యాంకులు, ఇతర వ్యవహారాలతో వోల్డ్ సిటీ అంతా అల్లుకుపోయిన కుటుంబం అది. రాజకీయాల్లో వాళ్లని బీట్ చేసేవాళ్లెవరూ రాలేదు. దీనికి  2 కారణాలున్నాయి. 1.  ముస్లిం వోటర్ల మీద ఆ కుటుంబానికి ఉన్న పట్టు,  2. రాజకీయాల్లో నేర్చుకున్న  పట్టువిడుపులు. చాలా కాలం  ఆ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉండింది. ముస్లిం వోట్ల కోసం కాంగ్రెస్ ఒవేసీలను వోల్డ్ సిటి నవాబుగా గుర్తింపు నిస్తూ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర సమితితో వాళ్లుచేతులు కలిపారు.  దీనితో తెలంగాణను వ్యతిరేకించిన ఆ కుటుంబానికి  తెలంగాణ  దేశభక్త ముద్ర పడింది. కెసియారయితే, వాళ్ల పార్టీ ఎఐఎంఐఎం తెలంగాణకి గర్వ కారణం ప్రకటించారు.ఇలాంటి సర్టిఫికేట్ ఒవైసీ కుటుంబానికి ఎపుడూ, ఎవరూ ఇచ్చి ఉండరు. ఒవైసీలు కూడా కెసియార్ కోసం, టిఆర్ ఎస్ ను గెలిపించేందుకు ముస్లిం ల మధ్య బాగా ప్రచారం చేస్తున్నారు. సరే ఇది వేరే కథ.

ఒవైసీ కుటుంబం అంటే ఇపుడు హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, ఆయన తమ్ముడు చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవేసీయే.  ఇద్దరు మంచి వక్తలు. ప్రజల్లో తమ ప్రసంగాల ద్వారా ఆవేశాలు రేకెత్తించగల శక్తి ఉన్నవారు. సభల్లో  చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు.

అయితే, వయసులో చిన్నవాడైనా అక్బరుద్దీన్ నిన్న ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ తాను రాజకీయాలనుంచి విరమించుకుకోవాలనుకుంటున్నట్లు, ఇది తాను పోటీ చేస్తున్ చివరి ఎలెక్షన్ కావచ్చని ప్రకటించి అక్కడున్న ప్రజలకు షాక్ ఇచ్చారు. దీనికి కారణం కూాడా చెప్పారు. అనారోగ్యం వల్ల తాను ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని ఆయన ప్రకటించారు. యాకుత్ పురాలో ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆయన విషయం  ప్రకటించారు. దీనితో పాటు ఆయన మరిన్ని షాకింగ్ విషయాలు చెప్పారు.

తన మూత్ర పిండాలు పూర్తిగా పాడయ్యాయని కూడా ఆయన వెల్లడించారు. తన కిడ్నీ ల దగ్గిర కొన్ని తూటాల ముక్కలు ఇరుక్కుని ఉన్నాయని, డయాలిసిస్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారని,అయితే, తనకు టైం దొరకక ఇది వాయిదా పడుతూ వస్తున్నదని అక్బర్ చెప్పారు. దారుసలాం, పాఠశాలల, ఆసుపత్రులు,బ్యాంకుల నిర్వహణకే టైమంతా ఖర్చవుతున్నదని కూడా ఆయన చెప్పారు. తన కోసం తానెపుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఆశేష ముస్లిం ప్రజలకోసమే తాను ఎన్నికల్లోపోటీ చేస్తున్నానని అంటూ, ఇపుడు అనారోగ్యంతో  పోటీ చేయడం కష్టమని పిస్తూ ఉందని అన్నారు.  

అంతేకాదు, కమ్యూనిటీ కి సేవ చేసేందుకు ఎవరైనా సిద్ధంగా ఉంటే ఆయన కోసం తన స్థానాన్ని ఖాళీ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు.

అక్బర్  కు ఇది ఐదో ఎన్నిక. గతంలో ఆయన నాలుగు సార్లు  ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నియ్యారు.  1999,2004.2009,2014 లలో చాంద్రాయణ గుట్ట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయాల్లో  ప్రవేశించేందుకు ాయన తన ఎంబిబిఎస్ చదువును మధ్యలోనే వదిలేశారు. అయితే, తండ్రి సలావుద్దీన్ ఒవైసీ స్థాపించిన  ఒవేసీ ఆసుపత్రికి మేనేజింగ్  డైరెక్టర్ గా ఉంటున్నారు.

2011 ఏప్రిల్ 30న నియోజకవర్గంలోని బార్కాస్ లో ఒక ర్యాలీలో పాల్గొనేందుకు జీపులో వెళ్తున్నపుడు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది.ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు మలక్ పేట  ఎంఐఎం ఎమ్మెల్యే  అహ్మద్ బలాలా  కూడా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో చొచ్చిుకు పోయిన బుల్లెట్టే ఆయన ఆనారోగ్యానికి కారణం.

విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలుచేశారన్న ఆరోపణలతో  2013 జనవరిలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.  

అక్బరుద్దీన్ మీద హత్యా ప్రయత్నం, ఆయన అరెస్టు ఆ రోజుల్లో హైదరాబాద్ ను కుదిపేశాయి. అయితే, ప్రళయం రాలేదు.  ఈ రెండు సంఘటలను జాగ్రత్తగా  హ్యండిల్ చేసినందుకు నాటి  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి చాలా  మంచి పేరొచ్చింది.