ముస్లిం రిజర్వేషన్ల అంశంపై చాలాకాలంగా విమర్శలున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారంపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీకి వున్న పట్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు గెలవడం సంగతి తర్వాత.. ముందైతే పోటీ చేయడానికీ భయపడే పరిస్థితి.
ఆ మజ్లిస్ పార్టీ సాయం కోరని రాజకీయ పార్టీలుండవంటే అతిశయోక్తి కాదు. హిందుత్వ ఎజెండా నెత్తినేసుకున్న బీజేపీ కూడా, అడపా దడపా మజ్లిస్ సాయం తీసుకుంటుండడం చూశాం. పైకి చెప్పేమాటలకీ, తెరవెనుకాల వ్యవహారాలకీ అస్సలు పొంతన వుండదు.
ఇక, నిన్నటి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ముస్లిం రిజర్వేషన్ల అంశమే హాట్ టాపిక్. కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ళ బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘మేం తెలంగాణలో అధికారంలోకి వస్తే, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం..’ అని ప్రకటించేశారు. నిజానికి, ఇది చాలా పెద్ద రిస్కీ వ్యవహారం.
తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి, ఈ దెబ్బతో ముస్లింల నుంచి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడే అవకాశం కూడా లేదిప్పుడు. గతంలో వుందని కాదుగానీ.. ఇప్పుడైతే అస్సలేమాత్రం ఛాన్స్ లేదు.
ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయడమంటే అది జరిగే పని కాదు. ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చి తప్పిన బీజేపీకి ఈ విషయంలో హిందువులేదో మద్దతిచ్చేస్తారనుకోవడం పొరపాటు.