ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ అవుతారా?

కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు చాలా ముఖ్యమయిన రోజు. సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన రోజు లాగే, ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా చారిత్రాత్మక దినం. అందుకే కాంగ్రెస్ నేతలు ప్రతిచోటా పండగ జరుపుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో పటాకులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. పార్టీనేతలంతా ప్రియాంక రాజకీయ ప్రవేశాన్ని ఆహ్వానించారు. ఆమె రాకతో కాంగ్రెస్ చక్రం అలా తిరిగిపోతుందనే ధీమా అందరిలో కనిపిస్తుంది. మరి ప్రియాంక గాంధీ మరొక ఇందిరా గాంధీ అవుతారా? అనడం లేదు గాని,  ఈ నియామకం వెనక ఉన్న ఆశ అదే.

 ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకురావడం హర్షనీయమే. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీలో అందునా ఉత్తర  ప్రదేశ్ కాంగ్రెస్ లో చెప్పుకో దగ్గర మహిళనాయకురాళ్లే లేరు. ఈ కొరతను ప్రియాంక తీరుస్తారు. ఇపుడామె స్టార్ ఫార్మరే. అయితే, పార్టీ స్టార్ ను మార్చగలరా?

1997లో సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత జితేంద్ర ప్రసాద మీద పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీని బతికించారు కాని అధికారంలోకి తీసుకురాలేకోయారు. తర్వాత ఏడేండ్లకు 2004 లో పార్టీ అధికారంలోకి వచ్చినా, అది యునైటెడ్ ప్రొగ్రెసివ్ ఫ్రంట్ సంకీర్ణం రూపంలోనే. రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది యుపిఎ రూపంలోనే. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేంత బలం సోనియా హయాంలో రానేలేదు. ఇంతలోనే నరేంద్ర మోదీ వచ్చి 2014 లో బిజెపి సుడిగాలి సృష్టించి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయికి ఆ పార్టీని తీసుకువచ్చారు. ఈ మధ్యలోనే సోనియా యుగం ముగిసింది. పార్టీ పగ్గాలు కుమారుడు రాహుల్ గాంధీ చేతికి వచ్చాయి. పార్టీ కొద్దిగా పుంజుకుంటున్నదని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక రాజకీయాల్లోకి ఫుల్ టైమర్ గా వస్తున్నారు. ఫుల్ టైమర్ గా మారడం కాదు,ఆమెకిచ్చిన అసైన్ మెంటు ను చూడాలి. యుపి తూర్పు లో ఆమె పార్టీ ని నడిపించాలి. అంటే ఆమె కూడా మోదీలాగా సుడిగాలి కనీసం తూర్పు ఉత్తర ప్రదేశ్ లో నైనా సృష్టించాలి. అయితే, తూర్పు యుపిలో సాధ్యమా అనేదే ప్రశ్న.

ఆమెను ఫుల్ టైమర్ చేసేంత వరకు బాగానే ఉంది. ఇల్లలకగానే పండగ కాదు. ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకురావడం దాకా పర్వాలేదు, జైకొట్టవచ్చు. ఒక దశాబ్దపు సస్పెన్స్ తొలగిపోయింది. అయితే, ఆమెకు అప్పగించిన బాధ్యత చాలా రిస్క్ తో కూడుకున్నది. ఆమెను ఎఐసిసి పార్టీ జనరల్ సెక్రెటరీ గా నియమించాక ఇచ్చిన బాధ్యతతో కాంగ్రెస్  ఒక సాహసోపేత ప్రయోగం చేసిందనే అనాలి. ఎందుకంటే ఆమెను ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతానికి ఇన్ చార్జ్ ను చేశారు. తూర్పు ఉత్తర ప్రదేశ్ చాలా ప్రతికూల రాజకీయభూభాగం. ఎందుకంటే, ఈ ఏరియాలోనే ప్రధాని నరేంద్రమోదీ పోటీచేసే వారణాశి ఉంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. ఇలాంటి హేమాహేమీలున్నతూర్పుఉత్తరప్రదేశ్ కు ఇన్ చార్జ్ గా నియమించడమంటే రిస్క్ తీసుకోవడమే.

సాధారణంగా పార్టీ నేతల వారసులు చాలా సేఫ్ గా రాజకీయాల్లోకి వస్తారు. ఎలాంటి రిస్క్ లేకుండా రాజకీయాల్లో సెటిలయి రాజకీయ వారసత్వం అనుభవిస్తూ ఉంటారు. పార్టీ అధినేత కొడుకనో, కూతురునో  ఛాతీ విరుచుకుని అవతలి పార్టీ నేత మీద పోటీకి నిలబడరు. కాని, ఇపుడు ప్రియాంక కు కాంగ్రెస్ పెద్ద పరీక్ష పెడుతూ ఉంది. ఆమె వారణాశిలో నరేంద్రమోదీ (ఆయన పోటీ చేస్తే)ని ఓడించాలి. అంతేకాదు, గోరఖ్ పూర్ ను ముఖ్యమంత్రి యోగి పట్టు నుంచి లాక్కోవాలి.

ముఖ్యంగా మోదీని వారణాశి నుంచి పోటీ చేస్తే, ఆయనను ఓడించేందుకు ఆమెయే ఎన్నికల వ్యూహం రచించాల్సి ఉంటుంది. అమలు చేయించాల్సి ఉంటుంది. ఇది ఆమె రాజకీయ సత్తాను నిరూపిస్తుంది.ఒక వేళ మోదీ అక్కడి నుంచి పోటీ చేయకపోతే, కాంగ్రెస్ అనుకుంటున్న వ్యూహంలో థ్రిల్ లేకుండా పోతుంది. ఆమెను తూర్పు యుపి ఇన్ చార్జ్ చేయడమే మోదీకోసమేనా అన్నట్లు కనిపిస్తుంది. అలాంటపుడు మోదీ వారణాసి కాకుండా మరోచోటికి పోతే యాంటిక్లయిమాక్స్ అవుతుంది. ప్రియాంక రాజకీయ ప్రవేశం మీద ఇంకా ప్రధాని మోదీ స్పందించాల్సి ఉంది.

తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు. ఉపన్యాస కళలో రాటుదేలి, చురకలు వేయడంలో దిట్టలయిన మోదీకి, యోగికి ఆమె ధీటుగా సమాధానం చెప్పాలి. దీని వల్ల నష్టమూ ఉంది. లాభమూ ఉంది. ఆమె విజయవంతమయితే, మరొక ఇందిరాగాంధీ కావచ్చు. లేదంటే, ఆమె రాజకీయ జీవితం కోలుకోలేని విధంగా దెబ్బతినవచ్చు.