ఆరోజులు పోయాయ్.. కాంగ్రెస్, ఆర్జేడీలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్..!

దేశ రాజకీయాల్లో అవినీతికి చెక్ పెట్టే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ గట్టిపట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అవినీతి చేసినవారు ఎవరైనా సరే, తప్పించుకోవడం అసాధ్యం అని బీహార్‌లోని గయలో జరిగిన మహాసభలో ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే 31వ రోజున పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఆయన ప్రకటించారు. ఇందు కోసం మూడు కొత్త బిల్లులను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఒక చిన్న ఉద్యోగి 50 గంటలు పోలీసుల అదుపులో ఉన్నా సస్పెండ్ అవుతాడు. కానీ పెద్ద పెద్ద నేతలు జైల్లో ఉన్నా పదవులను ఆస్వాదిస్తారు. ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవన్నారు. ఈ చట్టం ప్రకారం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా అరెస్టయినా 30 రోజుల్లోగా బెయిల్ రాకపోతే పదవి వదులుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు.

అవినీతి నిరోధక చట్టాలపై ప్రతిపక్షాలు భయపడుతున్నాయని మోదీ చురకలు అంటించారు. ఎందుకు భయపడుతున్నారు..? ప్రజలు అంతా అర్థం చేసుకుంటున్నారు. ఈ చట్టాల పరిధిలో ప్రధానమంత్రి కూడా వస్తారు అని చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత 60 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలనలో అవినీతి కేసులు లెక్కలేనన్ని జరిగాయని మోదీ విమర్శించారు. కాంగ్రెస్, ఆర్జేడీ పాలనల్లో ప్రాజెక్టులు ఎందుకు పూర్తికాలేదో అందరికీ తెలుసని విమర్శించారు. ప్రాజెక్టులు ఆలస్యమైతే అవినీతికి అవకాశం ఎక్కువ. ఖజానా నింపుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు. కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క అవినీతి మరక కూడా అంటలేదని గర్వంగా చెప్పగలను అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రజల డబ్బును కాపాడే దిశగా తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఈ బిల్లులు ఆ దిశలో మైలురాయిగా నిలుస్తాయని ఆయన చెప్పారు. అవినీతి పై పోరాటాన్ని చివరి వరకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని, దానికి ఎవరినీ వదిలిపెట్టమని గట్టిగా హామీ ఇచ్చారు. బీహార్‌లో జరిగిన సభలో వేలాది మంది మోదీ ప్రసంగాన్ని విన్నారు. ఆయన మాటలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అవినీతి వ్యతిరేకంగా ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తే, రాబోయే ఎన్నికల రాజకీయ సమీకరణలు కూడా పూర్తిగా మారిపోతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.