హిందూ మతంలో కాశీ లేదా వారణాసికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. శివుడు స్వయంగా ఇక్కడ నివసిస్తాడని నమ్మకం. కాశీలో మరణించినవారికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే దీనిని “మోక్షనగరం”గా పిలుస్తారు. ఇక్కడ ఘాట్ లలో 24 గంటలూ చితి మంటలు ఆరిపోవు. ప్రతి రోజూ వందలాది శవాలు దహనం అవుతుంటాయి. అయితే, ఆశ్చర్యకరంగా కాశీలో ఐదుగురి దహన సంస్కారాలు మాత్రం జరగవంట. దీని వెనుక హిందూ గ్రంథాలు, ముఖ్యంగా గరుడ పురాణంలో పేర్కొన్న గాఢమైన కారణాలు ఉన్నాయి. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మొదటగా సాధువులు మరియు ఋషుల దేహాలను దహనం చేయరు. వారు గృహస్థ జీవితం, ప్రాపంచిక బంధనాలు అన్నింటినీ విడిచిపెట్టినవారు. అందువల్ల వారి శరీరాలకు జల సమాధి లేదా తహ్లీ సమాధి ఇచ్చే సంప్రదాయం ఉంది. ఇక ఇక్కడ 11 సంవత్సరాల లోపు పిల్లల దహనం కాశీలో జరగదు. నిరపరాధమైన పిల్లల ఆత్మలు పవిత్రమైనవిగా పరిగణిస్తారు. గరుడ పురాణం ప్రకారం, అలాంటి పిల్లలకు భూమి సమాధి చేయడమే తగినదిగా భావిస్తారు.
మూడవది గర్భిణీ స్త్రీల శరీరాలను కూడా దహనం చేయరు. గర్భంలో ఉన్న శిశువు కారణంగా శవం దహనం చేస్తే కడుపు పగిలే ప్రమాదం ఉందని, ఇది శాస్త్రప్రకారం అనుచితమని భావిస్తారు. అందువల్ల వారికి జల సమాధి చేసే సంప్రదాయం ఉంది. నాలుగవది పాము కాటు లేదా విషప్రయోగంతో మరణించినవారి శరీరాలను దహనం చేయరు. ఇక్కడి నమ్మకం ఏమిటంటే.. అలాంటి శరీరాల్లో 21 రోజుల పాటు సూక్ష్మ జీవం ఉండి ఆత్మ పూర్తిగా శరీరాన్ని విడిచి వెళ్లదని. కాబట్టి వారిని భూమిలో సమాధి చేస్తారు. ఐదవది అంటు వ్యాధులు, ముఖ్యంగా కుష్ఠు వ్యాధితో మరణించిన వారి దేహాలను దహనం చేయరు. ఎందుకంటే దహనం చేస్తే గాలిలో వ్యాధికారక బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల వారికి ఖననం చేసే సంప్రదాయం కొనసాగుతోంది.
కాశీ అనేది కేవలం ఒక నగరం కాదు, హిందూ మతంలో మోక్షానికి చిహ్నం. ఇక్కడ జరిగే ప్రతి ఆచారానికి, ప్రతి సంప్రదాయానికి వెనుక లోతైన శాస్త్రార్థం దాగి ఉంది. ఐదుగురి దహనం జరగకపోవడం కూడా ఒక విశిష్టమైన ఆచారం, ఇది నేటికీ కొనసాగుతూనే ఉంది.
