కేసీఆర్ మినీ కేబినేట్ లో వీరికే చాన్స్

డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ కేబినేట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి కేబినేట్ కాకుండా మిని కేబినేట్ కొలువు తీరే అవకాశం ఉందని తెలుస్తోంది. 6 లేదా 8 మంది మంత్రులతో మిని కేబినేట్ కూర్పు ఉంటుందని చర్చ జరుగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల పై దృష్టి పెట్టనుండడంతో తక్కువ మందితో కేబినేట్ ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ మిని కేబినేట్ లో చోటు దక్కించుకునే అదృష్ట వంతులు ఎవరనేది ఉత్కంఠగా మారింది. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని కేసీఆర్ కేబినేట్ కూర్పు చేయనున్నారు. ఇందులో రెడ్డి, వెలమ, ఇద్దరు బిసిలు, ఎస్సీ, ఎస్టీ లను ఒక్కరి చొప్పున తీసుకుంటారని తెలుస్తోంది. 

కేటిఆర్, హరీష్ రావులను మొదటి విడతలోనే కేబినేట్ లోకి తీసుకోవడం ఖాయమైందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. కేటిఆర్ పార్టీ బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వంలోను భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ విశ్వసిస్తున్నారట. అందుకే కేటిఆర్ కు పార్టీ బాధ్యతలతో పాటు మంత్రి పదవి కూడా అప్పగించాలని భావిస్తున్నారట. హరిష్ రావుకు నీటి పారుదల కాకుండా శాఖను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హరీష్ రావును మంత్రి వర్గంలోకి తీసుకోకపోయినా, రెండో విడతలో అవకాశం కల్పించిన ప్రజలల్లోకి, పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో హరీష్ రావుకు కూడా మొదటి విడతలోనే మంత్రిగా అవకాశం లభించనుంది.  

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావులకు మొదటి విడతలోనే అవకాశం దక్కనుందని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూపల్లి కృష్ణారావు ఓడిపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లికి మొదటి విడతలో స్థానం దక్కనుంది. కడియం శ్రీహరిని డిప్యూటి సీఎంగానే కొనసాగించనున్నారని తెలుస్తోంది. దీంతో అతని బెర్త్ కూడా మంత్రి వర్గంలో ఖాయమైనట్టే. కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి అయిపోతే తిరిగి ఎమ్మెల్సీగా ఎంపిక చేసి పూర్తి స్థాయిగా కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.

 

  మోదీ కూడా ఐరన్ లెగ్ అవుతున్నారా… చదవండి

 

మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్ కు కూడా మిని కేబినేట్ లోనే స్థానం దక్కనుంది. ఈటల రాజేందర్ స్పీకర్ గా ఎంపికవుతారని జోరుగా చర్చ జరుగుతోంది. అయితే  ఆ పదవిని స్వీకరించడానికి ఈటల రాజేందర్ సుముఖంగా  లేరని తెలుస్తోంది. దీంతో ఈటల రాజేందర్ కు మంత్రి వర్గంలోనే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారని చర్చ జరుగుతోంది.

మొదటి విడతలోనే  పద్మా దేవేందర్ రెడ్డి, రెడ్యా నాయక్ లకు కూడా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. లేనిచో రెండో విడతలోనైనా వీరికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు మినీ కేబినేట్ నే కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మినీ కేబినేట్ లో చోటు వీరికి దక్కేనా లేక కేసీఆర్ అప్పటికప్పుడు కొత్త ముఖాలను తీసుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది.