తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొననుంది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో, గ్రామాల్లో ఎన్నికల ఉత్సాహం కనిపిస్తోంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికలు గ్రామీణ ప్రజాప్రతినిధుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో వరుసగా ఓటింగ్ ఉండగా.. అన్ని విడతలకూ పోలింగ్ సమయం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్ణయించారు. ప్రత్యేకత ఏమిటంటే.. పోలింగ్ పూర్తయిన అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచే కౌంటింగ్ మొదలై ఫలితాలు ప్రకటించబడతాయి.
31 జిల్లాల్లోని 545 మండలాల్లో జరగనున్న ఈ భారీ ఎన్నికల్లో మొత్తం 12,760 సర్పంచ్ పదవులు మరియు 1,12,534 వార్డు సభ్యుల స్థానాలు ప్రజాభిప్రాయానికి లోబడి ఉన్నాయి. రాష్ట్రంలో నమోదై ఉన్న గ్రామీణ ఓటర్ల సంఖ్య 1,66,55,186.. ఇది ఈ ఎన్నికల విస్తృతతకు నిదర్శనం. పల్లె రాజకీయాలు, గ్రామ అభివృద్ధి, స్థానిక నాయకత్వం.. ప్రతిదానికీ ఈ ఎన్నికలు కీలకమవుతాయి.
మొదటి విడతలో 4,200 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డులు, రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులు, చివరి విడతలో 4,159 సర్పంచ్‌లు, 36,452 వార్డులు ప్రజా తీర్పు కోసం సిద్ధమవుతున్నాయి. నామినేషన్లు నవంబర్ 27 నుంచి మొదటి విడతకు, 30 నుంచి రెండో విడతకు, డిసెంబర్ 3 నుంచి మూడో విడతకు స్వీకరించనున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ఈమేరకు ప్రకటించారు.
ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి రావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. అభ్యర్థుల పర్యటనలు, వర్గాల సమీకరణ, స్థానిక నాయకుల వ్యూహాలు.. ప్రతి పల్లెలో ఎన్నికల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే మూడు వారాలు తెలంగాణ గ్రామాల్లో రాజకీయంగా అత్యంత ఉత్కంఠభరితంగా ఉండడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
