తెలంగాణ మంత్రి వర్గ ఆశావాహులకు ఝలక్

తెలంగాణ మంత్రి వర్గంలో బెర్తు కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు మరోసారి నిరాశ ఎదురైంది. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం నుంచి పంచాయతీ రాజ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టవద్దని  రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మంత్రి వర్గ విస్తరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కోడ్ అమలులో ఉన్నందున అసెంబ్లీ సమావేశానికి కూడా ఎన్నికల సంఘం అనుమతి తప్పని సరి అని పేర్కొంది.

ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు అధికారుల బదిలీలు చేపట్టవద్దని ఆదేశించింది. బతుకమ్మ చీరల పంపిణీ, రైతు బంధు చెక్కుల పంపిణీ నిలిపి వేయాలని సూచించింది. పాలక మండళ్లు ఉన్న చోట జిల్లా, మండల , మున్సిపల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని కానీ విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎన్నికల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపింది.

తెలంగాణలో డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సంపూర్ణ మెజార్టీతో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోం మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల పై దృష్టి పెట్టడంతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టలేదు. ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించలేదు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేయడంతో పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు మినీ కేబినేట్ ను కొనసాగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ మిని కేబినేట్ లో 6గురు ఉంటారని లేదా 8 మందికి అవకాశం ఉంటుందన్న చర్చ జోరుగా సాగింది. కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటన, హస్తిన టూర్ ముగిసిన వెంటనే ఏ క్షణాన్నైనా మంత్రి వర్గ విస్తరణ జరగవచ్చన్న చర్చ జరిగింది కానీ అది కూడా జరగలేదు. ఓ వైపు బిసి రిజర్వేషన్ల కేటాయింపు పై కోర్టులో కేసు ఉండగానే ఎన్నికల సంఘం హడావుడిగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. 

ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయగానే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టరాదు. శంకుస్థాపన తదితర పనులు చేపట్టడానికి వీల్లేదు. అయితే మంత్రి వర్గ విస్తరణకు కూడా అవకాశం లేకపోవడంతో ఇక ఫిబ్రవరిలోనే మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జనవరి 21 న మొదటి విడత, జనవరి 25 న రెండో విడత, జనవరి 31న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 31 వరకు పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాతే మంత్రి వర్గ విస్తరణకు అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.