మంత్రి వర్గ విస్తరణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

తెలంగాణ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు స్పందించారు. కొంత మంది కావాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నేను ఎటువంటి తప్పు చేయడం లేదు. కేసీఆర్ నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటిస్తానన్నారు. ఆయన ఏమన్నారంటే..

“తెలంగాణ మంత్రి వర్గంలో నాకు చోటు దక్కలేదనే అసంతృప్తితో నేను లేను. నాకు ఎటువంటి గ్రూపులు లేవు. కొంత మంది కావాలని సోషల్ మీడియాలో నా పై తప్పుడు ప్రచారాలు  చేస్తున్నారు. నేను గతంలో చెప్పినా… ఇప్పుడు కూడా చెబుతున్నా. సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. నేను అన్నింటికన్నా ముందు పార్టీకి ఒక సైనికుడిలా పని చేస్తాను. నాకు ఏ గ్రూపు రాజకీయాలు లేవు. ఏ ఎమ్మెల్యేను నా వెంట నేను తిప్పుకోలేదు.

పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ మంత్రి వర్గంలో పలువురికి స్థానం కల్పించారు. మంత్రులంతా కూడా ప్రజా క్షేమం కోసం పని చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాధ్యతలతో పాటు పార్టీ బాధ్యతలు కూడా నా పై ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయాల్సిన బాధ్యత నా పై ఉంది. నాకు మంత్రి పదవి రాకపోవడం పై అనవసర రాద్దాంతం చేస్తున్నారు. అన్నింటిని మానేసి తెలంగాణ అభివృద్ది కోసం ఆలోచిస్తే మంచిదని కోరుకుంటున్నాను.” అని హరీష్ రావు అన్నారు.

హరీష్ రావు వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలో చర్చనీయంశమయ్యాయి. మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరైన హరీష్ రావు కాస్త డల్లుగానే కనిపించారని నేతలు చర్చించుకుంటున్నారు. ప్రమాణ స్వీకారంలో హరీష్ రావు, కేటిఆర్ లు ఒకే దగ్గర కూర్చోవడం గమనార్హం. వీరిద్దరు అందరితో చిరునవ్వులు చిందిస్తూ కనిపించినా అది గుండె లోతులో నుంచి వచ్చినది కాదని పలువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. ఏదేమైనా ఈ దఫాలో హరీష్ రావుకు స్థానం దక్కకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.