కాంగ్రెస్ దయతలిస్తేనే, గులాబీ పార్టీ బతికేది.!

తెలంగాణలో గులాబీ పార్టీ భవిష్యత్తేంటి.? భారత్ రాష్ట్ర సమితి తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అవుతుందా.? లేదంటే, బీఆర్ఎస్ పేరుతోనే కేసీయార్ జాతీయ రాజకీయాల్లో బిజీ అవుతారా.? అవన్నీ తర్వాత.. ముందైతే, గులాబీ పార్టీ బతుకు కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వుంటుంది.

గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు వ్యవహారం అందరికీ గుర్తుండే వుంటుంది. దానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. అన్నీ రేవంత్ రెడ్డే. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుంది. కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, ఆ వెంటనే.. కేసీయార్ మీద రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు దిగే అవకాశం లేకపోలేదు.

అదే జరిగితే, గులాబీ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వైపు దూకేస్తారో ఏమో.! హరీష్ రావుకి బీజేపీ గాలం వేస్తోంది. కాంగ్రెస్ కూడా పిలుస్తోంది ఆయన్ని చాలాకాలంగా. కేటీయార్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళరు. కేసీయార్ గురించి మాట్లాడకూడదు ఇలాంటి విషయాల్ని.

కేసీయార్, కేటీయార్ తప్ప గులాబీ పార్టీలో ఎవరూ మిగలరేమో.. అన్న చర్చ మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతోందిప్పుడు. పార్టీ ఫిరాయింపుల్ని ఓ ఉద్యమంలా గతంలో కేసీయార్ ప్రోత్సహించి, కాంగ్రెస్ పార్టీతో ఆడుకున్నారు. ఇప్పుడు ఆట ఆడే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ ఊరుకుంటుుందా.?

కానీ, ఈలోగా కాంగ్రెస్ పార్టీకి కేసీయార్ సాగిల పడితే.? లేదంటే, బీజేపీ ఆశీస్సుల కోసం కేసీయార్ దేబిరిస్తే.? ఇలాంటి ప్రశ్నలూ రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాల్లో కేసీయార్‌కి ఎవరూ శతృవులు కాదు. సమయానుకూలం ఆయన ఆలోచనలు మారిపోతుంటాయ్.!

గులాబీ పార్టీ బతకాలంటే తప్పదు, కేసీయార్.. కాంగ్రెస్ పార్టీతోనో, బీజేపీతోనో.. అంటకాగాల్సిందే.!