ఇటు కామెడీ, అటు సీరియస్ కథలతో అలరించే హీరో అల్లరి నరేష్. కొన్నాళ్ళుగా సీరియస్ కథలపై దృష్టి పెట్టిన ఆయన.. తనకు గుర్తింపు తీసుకొచ్చిన కామెడీ జోనర్ లో’ఆ ఒక్కటీ అడక్కు’తో ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వచ్చారు. మల్లి అంకం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ఈవీవీ క్లాసిక్ టైటిల్ ని వాడుకోవడం మరో విశేషం.
గణపతి అలియాస్ గణ (అల్లరి నరేష్) సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారి. జీవితంలో స్థిరపడినప్పటికీ తనకి ఇంకా పెళ్లి కాదు. సంబంధాలు వచ్చినట్టే వచ్చి రిజెక్ట్ అవుతుంటాయి. తన తమ్ముడికి కూడా పెళ్లయిపోయింది. కానీ తాను పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూనే వుంటాడు. చివరి ప్రయత్నంగా హ్యాపీ మాట్రిమొనీని సంప్రదిస్తాడు. అక్కడివారు చూపిన మ్యాచ్ లో గుణకి సిద్ది (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం అవుతుంది. తొలి చూపులోనే బాగా నచ్చుతుంది. కానీ సిద్దికి మాత్రం తనకు ఇంకా తొమ్మిది ఆప్షన్స్ వున్నాయని, అవన్నీ చూశాకే ఒక నిర్ణయానికి వస్తానని గుణని వెయిటింగ్ లిస్టు లో పెట్టేస్తుంది. మరి సిద్ది, గుణతో పెళ్ళికి అంగీకరించిందా? అసలు సిద్ది ఎవరు ? జీవితంలో సెటిల్ అయినప్పటికీ గణకి వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది ? చివరికి గణ పెళ్లి చేసుకున్నాడా లేదా ? అనేది మిగతా కథ. పెళ్లి అనేది ఒక ఎమోషనల్ బాండ్. ఈ ఎమోషన్ ని క్యాష్ చేసుకొని కొన్ని మ్యాట్రీమొనీ కంపెనీలు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. పెళ్లి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండలనే అంశాలని వినోదాత్మకంగా చెబుతూనే మంచి సందేశం ఇచ్చిన చిత్రమిది. గణ పెళ్లి చూపులతో మొదలైన కథ ఆహ్లాదకరమైన నవ్వులు పంచుతూ ముందుకు సాగుతుంది. గణ మాట్రిమొనీలో జాయిన్ అవ్వడం, అక్కడ స్కీములు, హీరోయిన్ పరిచయం, ఇవన్నీ హిలేరియస్ గా ముందుకు సాగుతాయి.
ఇంటర్వెల్ కు ముందు వచ్చిన ట్విస్ట్ బావుంది. సెకెండ్ హాఫ్ లో మాట్రిమొనీ పేరుతో జరుగుతున్న మోసాలు ఒకొక్కటీ వెలుగులోకి తీసుకురావడం, హీరో, హీరోయిన్ ఎమోషన్స్, చివర్లో కోర్ట్ రూమ్ డ్రామా ఇవన్నీ ప్రేక్షకులకు వినోదం పంచుతూనే ఆలోజింపచేసేలా వుంటాయి. గణ పాత్రలో నరేష్ లుక్ కొత్తగా హుందాగా వుంటుంది. కామెడీ సీన్స్ లో నవ్విస్తూనే ఎమోషనల్ సీన్స్ లో హత్తుకున్నారు. ఫరియా నరేష్ కి జోడిగా యాప్ట్. అందం అభినమయంతో ఆకట్టుకుంది.
నరేష్ మరదలి పాత్రలో నటించిన జావిూ లివర్ నవ్వులు పంచింది. మురళీ శర్మ, అజయ్, అనీష్ కురువిల్ల, రాజీవ్ కనకాల, రఘుబాబు, గోపరాజు రమణ పరిధిమేర కనిపించారు. గౌతమి జడ్జ్ గా గెస్ట్ రోల్ పోషించారు. గోపిసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. పాటలు కలర్ ఫుల్ గా చిత్రీకరించారు, నేపధ్య సంగీతం ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. కెమెరాపనితనం బావుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అబ్బూరి రవి రాసిన మాటలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. దర్శకుడు మల్లి అంకం వినోదంతో పాటు మంచి సందేశం వున్న సినిమా ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు.