ఓటిటిలోకి వచ్చిన ఫహాద్‌ ఫాజిల్‌ మూవీ

ఇటీవల మళయాళంలో విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఆవేశం’ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ‘పుష్ఫ’ చిత్రంలో విలన్‌గా ఆకట్టుకున్న ఫహాద్‌ ఫాజిల్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కేరళలో రికార్డుల సృష్టించింది.

రూ. వంద కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది ప్రేమలు, మంజమ్మల్‌ బాయ్స్‌, ది గోట్‌ లైఫ్‌ సినిమాల తర్వాత రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. అంతేగాక ఫహద్‌ కేరీర్‌లోనే ఈ ఘనత సాధించిన మొదటి చిత్రంగా ‘ఆవేశం’ చరిత్ర సృష్టించింది. గ్యాంగ్‌ స్టర్‌ కథకు కామెడీని, మదర్‌ సెంటిమెంట్‌ను జోడిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను వీపరీతంగా అలరించింది. బీటెక్‌ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ముగ్గురు మిత్రులను సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. దీన్ని భరించలేని ఈ ముగ్గురు ఫ్రెండ్స్‌ ఓ గ్యాంగ్‌స్టర్‌ ను కలిసి అతని సాయంతో సీనియర్లపై తిరగబడతారు. ఆ తర్వాత నుంచి ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసిపోతారు.

చివరకు ఈ ముగ్గురు మిత్రులు గ్యాంగ్‌స్టర్‌ను చంపేందుకు ఎందుకు ప్లాన్‌ చేశారనే ఆసక్తికరమైన పాయింట్‌తో సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ స్వయంగా సుమారు రూ. 20 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించగా వంద కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మే 9 గురువారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మలయాలంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ స్త్రీమింగుకు తీసుకు వస్తున్నారు. గతంలో రోమాంచం వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన జీతూ మాధవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.