నవదీప్‌ ‘యేవమ్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల!

యువ నటుడు నవదీప్‌ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘యేవమ్‌’ అనే సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. నవదీప్‌, పవన్‌ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి చాందిని చౌదరి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘ఆడపిల్లనే! ఐతే ఏంటంట?‘ అంటూ పోలీసుగా సీరియస్‌ లుక్‌లో చాందిని ఉండగా.. మహిళా సాధికారికతను చాటి చెప్పే విధంగా చాందిని పాత్ర ఈ చిత్రంలో కనిపించనుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మరో కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు మేకర్స్‌. ఈ మూవీ నుంచి అషు రెడ్డి ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. నా బాడీ సూపర్‌ డీలక్స్‌ అంటూ ఈ పోస్టర్‌ ఉండగా.. హారిక అనే బోల్డ్‌ పాత్రలో అషు రెడ్డి నటించబోతున్నట్లు తెలుస్తుంది.

చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.