‘తలైవా’ జీవితం ఆధారంగా చిత్రం!

అభిమాన హీరోను తెరపై చూస్తే ఫ్యాన్స్‌ కు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇక వారు చేసే యాక్షన్‌ వెండితెరపై ఆవిష్కరించడం చేస్తే ఆనందంలో మునిగి తేలుతుంటారు ప్రేక్షకులు. తాము అభిమానించే హీరో జీవితం తెరపైకి వస్తే సినీ ప్రియులకు పండగే. బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో దర్శక నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సాజిద్‌ నదియావాలా అలాంటి ప్రయత్నంలోనే ఉన్నారు.

ప్రస్తుతం ఆయన తమిళ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ బయోపిక్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. సాజిద్‌ కేవలం రజనీకాంత్‌ నటనకు మాత్రమే కాదు. ఆయన వ్యక్తిత్వానికి కూడా వీరాభిమానులుంటారు. ఆయన చేసే సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే ఆయన గురించి పూర్తి విషయాలు ఎవరికీ తెలియదు. అందుకే ఆయన జీవితాన్ని తెరపై చూపించాలని సాజిద్‌ నిర్ణయించు కున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌ స్టార్‌ వరకూ ఆయన ఎలా ఎదిగారు, ఎక్కే ఒక్కో మెట్టులో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అన్నది సినిమాగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ కథపై చర్చలు చేస్తునట్లు, ఆయన కుటుంబంతో చర్చలు జరుపుతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇ

ప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు కూడా మొదలయ్యాయట. గతేడాది ‘జైలర్‌’తో భారీ విజయం అందుకున్నా ‘తలైవా’ ఈ ఏడాది తన కూతురు దర్శకత్వంలో వచ్చిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రంతో పరాజయాన్ని చవిచూశారు. ప్రస్తుతం ఆయన ‘వేట్టయాన్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. టి.జె జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకుడు. తదుపరి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘తలైవర్‌171’ చిత్రం చేయనున్నారు.