తాజాగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో టీం ఇండియా ఓటమి పాలైంది. లీగ్ దశలో వరుసగా 9 మ్యాచ్ లు గెలిచిన భారత్, సెమీస్ లోనూ సత్తా చాటింది. కారణం ఏదైనా… ఫైనల్ లో అన్యూహ్యంగా ఓటమి పాలైంది. ఈ సమయంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్స్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. దీంతో… భారత్ కు కప్పు దక్కలేదు కాబట్టి… బీఆరెస్స్ హ్యాట్రిక్ సంగతేంది అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ!
అధికార బీఆరెస్స్ లో కేసీఆర్ వాయువేగంతో తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటే… అమ్రోపక్క హరీశ్ రావు, కేటీఆర్ లు ఎవరికి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు నేతలు గడిచిన వారం.. పది రోజులుగా ప్రపంచకప్ టోర్నీలో టీం ఇండియా విజయయాత్రను ప్రస్తావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ కప్ లో టీం ఇండియా ఎలాగైతే దూసుకుపోతుందో… తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్స్ కూడా అదే రీతిలో దూసుకువెళ్తాదని చెప్పుకొచ్చారు.
అక్కడితో ఆగని బావా, బావమరిదులిద్దరూ… టీమిండియా చేతికి ప్రపంచకప్.. బీఆరెస్స్ హ్యాట్రిక్ ఖాయమని పదే పదే చెప్పుకొచ్చారు. అయితే ఊహించని స్థాయిలో కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులకు కన్నీరు మిగులుస్తూ… టీం ఇండియా ఫైనల్ మ్యాచ్ లో చేతులెత్తేసింది. దీంతో… ఆ ఓటమిని జీర్ణించుకుంటూనే తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్స్ హ్యాట్రిక్ పై కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
టీం ఇండియా చేతికి ప్రపంచకప్ రావడం సంగతేమో కానీ… అనవసరంగా బీఆరెస్స్ హ్యాట్రిక్ విజయంతో లింకు పెట్టి.. ప్రపంచ కప్ లేకుండా చేశారన్న విరుపులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. ఇదే సమయంలో… ప్రపంచకప్ లో ఫైనల్ పోటీలో టీం ఇండియా చేతులు ఎత్తేయటమంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ పరిస్థితి కూడా ఇంతేనా? అనే ప్రశ్నలు తదనుగుణంగా దర్శనమిస్తున్నాయి. మరి ఈ కామెంట్లపై బీఆరెస్స్ నేతలు.. మరి ముఖ్యంగా హరీష్ – కేటీఆర్ లు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!