తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఓ వైపు, పలు సర్వేల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు.. అంటూ ప్రచారం ఇంకో వైపు.!
కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారా.? లేదా.? అన్నది వేరే చర్చ. కాంగ్రెస్ పార్టీలోనూ అంతర్గత కలహాలున్నాయి. అవే కాంగ్రెస్ పార్టీకి శాపం కాబోతున్నాయి. ఇంకోపక్క, బీజేపీని తేలిగ్గా తీసి పారేయలేం ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో.
ఇంతటి ప్రత్యేక పరిస్థితుల్లో భారత్ రాష్ట్ర సమితి కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచి తూచి అడుగు వేయాలి. కానీ, సెటిలర్లను కెలుకుతోంది గులాబీ పార్టీ. ప్రధానంగా హరీష్ రావు, తనదైన స్టయిల్లో ఆంధ్రోళ్ళపై విషం చిమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దాన్ని అవకాశంగా తీసుకుని, హరీష్ రావు కూడా చెలరేగిపోతున్నారు.
వైఎస్ షర్మిల మీద విమర్శలు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు, చంద్రబాబు మీద విమర్శలు.. ఇవన్నీ గులాబీ పార్టీకి ముందు ముందు ఇబ్బందికరంగా మారతాయి. గతంలో పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు.
ఇకప్పుడు తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ. కానీ, ఆ టీఆర్ఎస్ నుంచి తెలంగాణ మాయమైపోయింది. ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి. పార్టీ పేరులోంచి తెలంగాణ తీసేసి, భారత్ పెట్టుకున్నాక.. ఈ ఆంధ్రోళ్ళ పంచాయితీ ఏంటి.?
కేసీయార్ సంగతేమోగానీ, హరీష్ రావు అతి కారణంగా తెలంగాణలో గులాబీ పార్టీ మునిగిపోయేలా వుంది.! అదే జరిగితే, భారత్ రాష్ట్ర సమితి, తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని, ‘తెలంగాణ’ రాజకీయం చేయాల్సి వచ్చేలా వుంది.