Democracy: ప్రజాస్వామ్యం.! మునుగోడులో ‘పండగ’ చేసుకుంటున్న జనం.!

Munugode

 Democracy:  ‘హైద్రాబాద్‌లో మాకు పెద్ద ఆసుపత్రి వుంది.. మిమ్మల్ని ఆ ఆసుపత్రికి తీసుకెళ్ళి మంచి వైద్యం చేయిస్తాం. రాను పోను ఖర్చులూ మావే.. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు కూడా మాదే..’ అంటూ ఓ రాజకీయ నాయకుడు ఓటర్లను ప్రత్యేక వాహనాల ద్వారా హైద్రాబాద్ తరలించాడు.

ఇంకో రాజకీయ నాయకుడైతే, ఓ ఐదారొందల మందిని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి తీసుకెళ్ళాడు. ఫలానా పార్టీకే ఓటేస్తామంటూ వారిచేత యాదాద్రి కొండపై ప్రమాణం చేయించాడు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో బస్సుల్ని వినియోగించాల్సి వచ్చింది కూడా.

జస్ట్, ఎన్నికల ‘సిత్రాల్ల్’ ఇవి కొన్ని మాత్రమే.! మటన్ దుకాణాల వద్ద టోకెన్లు, పెట్రోల్ బంకుల్లో టోకెన్లు.. అక్కడా, ఇక్కడా అన్న తేడాల్లేవ్.! అన్న చోట్లా ప్రలోభాలు నడిచాయ్. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల వెంట నడిచేందుకోసం రోజు కూలీ ఇవ్వడం తప్పనిసరి. ఎందుకంటే, ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో దాదాపుగా అందరూ పెయిడ్ కార్యకర్తలే.!

జనం ముదిరిపోయారు.. రాజకీయ నాయకులూ ముదిరిపోయారు.. మధ్యవర్తులూ ముదిరిపోయారు. ప్రజలంటే ఎవరు.? వీళ్ళే కదా.! ఒకర్ని ఇంకొకరు దోచుకోవడమన్నమాట. వంద మందిని తీసుకొచ్చి, నూట యాభై మందికి లెక్క కట్టే మద్యవర్తులూ లేకపోలేదు.

వెరసి, అన్ని రాజకీయ పార్టీలకూ మునుగోడులో తడిసిపోతోంది. ప్రజలు మాత్రం పండగ చేసుకుంటున్నారు. వాళ్ళకీ తెలుసు, ఎన్నికలయ్యాక ఏ రాజకీయ నాయకుడూ తమ మొహం చూడబోడని. అందుకే, అందినకాడికి దండుకోవడం సామాన్య ప్రజలకూ తప్పడంలేదు.

క్వార్టర్ మద్యం ఏం ఖర్మ, ఫుల్ బాటిల్ మద్యమే దొరుకుతుంటేనూ.! ప్రతిరోజూ బిర్యానీలే.! పెట్రోల్ ఖర్చు పెద్దగా లేదు. కూలీ పనులకు వెళ్ళాల్సిన అవసరమూ లేదు. దాదాపు రెండున్నర లక్షల మంది ఓటర్లు.. ఈ ఉప ఎన్నికలో ఏం తేల్చుతారోగానీ, ఉప ఎన్నిక పేరు చెప్పి దాదాపు నెల రోజులపాటు సామాన్యులకు మునుగోడులో ఉపాధి మాత్రం దొరికింది.