రేవంత్ అనుచరుడిని బూతులు తిట్టిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే (వీడియో)

కాంగ్రెస్ పార్టీలో మితిమీరిన అంతర్గత ప్రజాస్వామ్యం నేతల మధ్య తిట్ల దండకానికి దారి తీస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సొంత పార్టీ నేత మీదనే నోరు పారేసుకున్నారు. ఆ సొంత పార్టీ నేత ఎవరంటే రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడైన తోటకూర జంగయ్య యాదవ్. రేవంత్ తో పాటే జంగయ్య యాదవ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం మేడ్చల్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఘట్ కేసర్ గ్రామ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ పై సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రేవంత్ ముఖ్య అనుచరుడు అయిన తోటకూర జంగయ్య యాదవ్ భారీ సంఖ్యలో కార్యకర్తలను తీసుకొచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కెఎల్ఆర్) తోటకూర జంగయ్య యాదవ్ తో గొడవకు దిగారు. జంగయ్య యాదవ్ మీద నోరు పారేసుకున్నారు. నిన్ను ఇక్కడికి ఎవడు రమ్మన్నడు బే  అంటూ ముత్క కూతలు కూసిండు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి.

లక్ష్మారెడ్డిపై జంగయ్య యాదవ్ అనుచరులు మండిపడుతున్నారు. జంగయ్య యాదవ్ కు వస్తున్న ప్రజాధరణ ను చూసి ఓర్వలేని మాజీ శాసన సభ్యుడు కె.లక్మ్షారెడ్డి దుర్భాషలాడుతున్నాడని ఆరోపించారు. గత ఎన్నికల్లో లక్ష్మారెడ్డి మీద పోటీ చేసిన జంగయ్య యాదవ్ పోటీ చేసి రెట్టింపు ఓట్లు తెచ్చుకున్నారని తెలిపారు. నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటూ సమస్య లపై పోరాటాలు చేస్తున్న తోటకూర జంగయ్య యాదవ్ కు ఉన్న ఆదరణతో లక్ష్మారెడ్డికి ఎక్కడ టిక్కెట్ గల్లంతవుతుందో అని భయపడి ఇలా నోరు పారేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన నాటి నుండి నేటి వరకు లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఏనాడూ ప్రజా సమస్యలపై స్పందించి న దాఖలాలు లేవని వారు అంటున్నారు. జంగయ్య యాదవ్ పై పొగరుగా నోరు పారేసుకున్న లక్ష్మారెడ్డికి త్వరలోనే బుద్ధి చెబుతామని వారు హెచ్చరిస్తున్నారు.
గొడవ తాలూకు వీడియో కింద ఉంది చూడండి.