తెలంగాణ మంత్రులకు షాకిచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణ మంత్రులుగా ప్రమాణం చేశామన్న ఆనందంలో ఉన్న వారికి సీఎం కేసీఆర్ ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు. మంత్రుల పర్సనల్ సెక్రటరీలుగా ఇష్టమున్న వారిని నియమించుకోవద్దని వారిని తానే స్వయంగా అపాయింట్ చేస్తానని సీఎం కేసీఆర్ మంత్రులకు తెలిపారు. దీంతో మంత్రులు ఒక్కసారిగా షాక్ కు గురైనట్టు తెలుస్తోంది.

ప్రతి మంత్రి దగ్గర ఒక పిఎస్, ఇద్దరు పిఏలు ఉంటారు. మంత్రి పేషీ అంతా పీఎస్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. పీఎస్ చెప్పాడంటే ఇక మంత్రి దానికి ఒప్పుకోవాల్సిందే. సంతకం పెట్టాల్సిందే. అయితే గతంలో మంత్రుల వద్ద పని చేసిన పిఎస్ లు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే మంత్రులు సరిగా పని చేయలేకపోయారని కేసీఆర్ గుర్తించారు. 

దీంతో ఈ సారి పీఎస్ లను ఎంపిక చేసుకునే అవకాశం మంత్రులకు ఇవ్వరాదని కేసీఆర్ నిర్ణయించారు. పీఏలను మాత్రం మంత్రులకు నచ్చిన వారిని నియమించుకునే అవకాశం ఇచ్చారు. కొంత మంది పీఎస్ లు ఆశతో పక్కదారి పడుతున్నారని వారు చేసిన తప్పులకు మంత్రులు బలవుతున్నారని కేసీఆర్ గుర్తించారు. అందుకే పీఎస్ ల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే పలువురు ఆశావహుల జాబితాను సీఎం కేసీఆర్ సిద్దం చేశారు. దానిని మంత్రులకు పంపించినట్టు కూడా తెలుస్తోంది. మంత్రులు బాధ్యతలు తీసుకునేలోపు పిఎస్ లు రంగంలోకి దిగనున్నారు. మరోవైపు మంత్రులుగా అవకాశం వస్తే మీకే అవకాశం ఇస్తామని పలువురు నేతలు హామీనిచ్చారు. కేసీఆర్ ఈ విధంగా తిరకాసు పెట్టడంతో ఏం చేయాలో తోచక వారు తలలు పట్టుకున్నట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ముఖ్యమైన శాఖలను తన వద్దే పెట్టుకున్నారు. ఈ సారి బడ్జెట్ ను కేసీఆరే ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా మంత్రులు ప్రమాణం చేసిన 24 గంటల్లోనే కేసీఆర్ వారి పై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది.