కేసీఆర్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. నెల్లూరులో జరిగిన సభలో కేసీఆర్ పై బాబు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? అని ప్రశ్నించారు. తన వద్ద పని చేసిన వ్యక్తి… ఇప్పుడు తననే తిడుతున్నారని అన్నారు. ఆయనను తాను 3 వేల సార్లు తిట్టానని చెప్పుకుంటున్నారని… ఆంధ్ర ప్రజలను కేసీఆర్ లక్షల సార్లు కించపరిచారని చెప్పారు. ఉలవచారును పశువులు తాగుతాయని, ఏపీ బిర్యానీ పేడలా ఉంటుందని నీచమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.

తెలంగాణలో ఇతర పార్టీలు లేకుండా చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏపీపై పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. బాంచన్ నీ కాల్మొక్కుతా అంటూ కేసీఆర్ ముందు వైసీపీ అధినేత జగన్ మోకరిల్లారని అన్నారు. కేసీఆర్ ఏపీకి రాలేరు కాబట్టి… ఆయన ఏజెంటుగా జగన్ ను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. వైసీపీకి డబ్బు పంపి ఏపీలో రాజకీయాలని చూస్తున్నారని అన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు వస్తే కేసీఆర్ కు బాధ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఏపీని వాడుకుంటారా? అని నిలదీశారు.

ఏపీలో 25 లోక్ సభ స్థానాలు టీడీపీకి వస్తే ఎవరు ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూద్దామని అన్నారు. ఢిల్లీలో కేసీఆర్ ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటివారి ఆటలు ఏపీలో సాగవని చెప్పారు. అన్ని పార్టీలను ఏకం చేసే శక్తి టీడీపీకి మాత్రమే ఉందని అన్నారు. వైయస్ హయాంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారని అన్నారు.