టీఎస్ వర్సెస్ టీజీ.! తేడా ఏంటి సీఎం రేవంత్ రెడ్డిగారూ.?

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ‘టీఎస్’ అనే అక్షరాలతో వుంటాయ్.! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, ‘టీజీ’ సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్.. అని అప్పట్లో అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల కేంద్రం అందుకు సమ్మతించలేదు, దాంతో, ‘టీఎస్’ ఖరారు చేశారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. వాహనాల రిజిస్ట్రేషన్ ఇకపై ‘టీజీ’గా జరుగుతుందిట.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి మండలిలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించడం జరిగిపోయింది. క్యాబినెట్ నిర్ణయం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. చట్టపరమైన సమస్యలు వుంటాయా.? కేంద్రం ఆమోదిస్తుందా.? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి రావడం సహజమే.

అసలు టీఎస్ నుంచి టీజీకి మార్చడం వల్ల ఉపయోగమేంటి.? తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ‘ఏపీ వర్సెస్ టీజీ’ అన్న ప్రస్తావన చూశాం. పలువురు తెలంగాణ ఉద్యమకారులు ‘టీజీ’ అనే అక్షరాల్ని పచ్చబొట్టుగా కూడా పొడిపించుకున్నారు. అదో సెంటిమెంట్.! ఎమోషనల్ బాండింగ్.. ఆ అక్షరాలతో.

తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే భారత్ రాష్ట్ర సమితిగా మారిందో, తెలంగాణ సెంటిమెంట్ కూడా గులాబీ పార్టీని వీడిపోయింది. తెలంగాణ ఉద్యమ నేత కేసీయార్, ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు, మాజీ ముఖ్యమంత్రిగా మిగిలారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్‌ని కాంగ్రెస్ పార్టీకి బలంగా అతికించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీ ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. టీఎస్ నుంచి టీజీగా మారితే.. నిజానికి, అదేమీ వింత కాదు. ఆ మార్పు వల్ల అదనపు ప్రయోజనమూ వుండదు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ‘ఏపీ’ అనే అక్షరాలతో తెలంగాణ వాహనాలు కనిపిస్తున్నాయ్. వాటికే ఇంకా ‘టీఎస్’ అని మార్చింది లేదు.! సో, కొత్తగా వచ్చే వాహనాలకు ‘టీజీ’ అని వుంటుందేమోగానీ, ఇప్పటిదాకా వున్న ‘టీఎస్’ వాహనాల అక్షరాలైతే మారవ్.