టిఆర్ఎస్ లో హరీష్ రావుకు మరో షాక్

గత పదిరోజులుగా టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఏదో జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. కేసిఆర్ మేనల్లుడు అయిన మంత్రి తన్నీరు హరీష్ రావుకు పొమ్మనకుండా పొగ పెడుతున్నారా? అని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఆయనను పక్కన పెట్టేశారు అని కొందరు అంటున్నారు. ఆయన సీటు మారుస్తారని కూడా ప్రచారం ఊపందుకున్నది. వస్తున్న విమర్శలపై హరీష్ రావు కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వలేదు. తూతూ మంత్రంగా ముక్తసరిగా వివరణ ఇచ్చారు.

ఈ పరిస్థితుల్లో హరీష్ రావు సీటు గల్లంతవుతుందని బిజెపి నేత రఘునందన్ రావు పెద్ద బాంబు పేల్చారు. జాతీయ పార్టీ అయిన బిజెపికి ఈ విషయంలో స్పష్టమైన సమాచారం ఉందన్నారు. కేసిఆర్ ప్రకటించిన 105 జాబితాలో మారే మొదటి సీటే హరీష్ రావుది అన్నారు. ఆయన సీటులో కేసిఆర్ పోటీ చేస్తారని చెప్పారు. దుబ్బాక సీటు కూడా మారిపోవడం ఖాయమన్నారు. హరీష్ కు అసలు టికెటే ఇచ్చే అవకాశం లేదన్నారు. హరీష్ తక్షణమే జాతీయ పార్టీ అయిన బిజెపిలోకి రావాలని ఆహ్వానం పలికారు.

ఈ పరిణామాలతోపాటు నమస్తే తెలంగాణ గత పదకొండు రోజులుగా హరీష్ రావుపై అప్రకటిత నిషేధం విధించిన విషయం జగమెరిగిన సత్యమే. తెలంగాణలోని మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల వార్తలు నమస్తే తెలంగాణలో పేజీలకు పేజీలుగా ప్రచురితమవుతున్నాయి. కానీ హరీష్ రావు వార్తలు మాత్రం నమస్తే తెలంగాణ పత్రికలో అచ్చు కాకుండా ఆ పత్రిక యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటున్నది. చివరకు జిల్లా పేజీల్లో కూడా ఆయన వార్తలకు స్థానం లేకుండా చేసింది. జోన్ పేజీకే హరీష్ రావు వార్తలను పరిమితం చేసింది. ఈనెల 10వ తేదీన చివరిసారిగా హరీష్ రావు వార్తను నమస్తే తెలంగాణ పత్రిక మెయిన్ మొదటి పేజీలో ప్రచురించింది. ఆ తర్వాత కనిపించని బ్యాన్ విధించింది.

తాజాగా అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మరో కీలకమైన విషయం తెలిసింది. నమస్తే తెలంగాణ పత్రికలోనే కాదు టిఆర్ఎస్ పార్టీకి అనుకూల మీడియాగా ముద్ర పడ్డ టి న్యూస్ లోనూ హరీష్ రావు వార్తలపై బ్యాన్ విధించారని తెలిసింది. ఈ బుధవారం అర్ధరాత్రి నుంచి హరీష్ రావు వార్తలను ప్రసారం చేయరాదని టి న్యూస్ యాజమాన్యం సంస్థలో పనిచేసే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

బుధవారం అంటే ఈనెల 19వ తేదీ రాత్రి నుంచి టి న్యూస్ లో హరీష్ రావు బొమ్మ కనబడితే ఒట్టు అని సంస్థకు చెందిన ఒక ఉద్యోగి తెలిపారు. ఈ విషయంలో ఏమైందో తమకు అర్థం కాలేదన్నారు. హరీష్ రావు వార్తలు వేయవద్దు అని మాకు చెప్పగానే మేమంతా షాక్ కు గురయ్యామన్నారు. మాకు ఆదేశాలు అందిన మాట వాస్తవమే అని ఆయన స్పష్టం చేశారు.

అయితే బుధవారం రాత్రి టి న్యూస్ అధిపతి అయిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్  తెలంగాణ భవన్ లోని టిన్యూస్ ఆఫీసులో ఉన్నత స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ సమావేశంలోనే హరీష్ రావు తాలూకు ప్రసారాలు నిలిపివేయాలని, ఏ వార్త వచ్చినా బులిటెన్లలో పెట్టరాదని ఆదేశాలు జారీ చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. 

అందుకే గత మూడు (గురు, శుక్ర, శని వారాల్లో) రోజులుగా తెలంగాణ ఉద్యమ ఛానెల్, టిఆర్ఎస్ అనుబంధ మీడియాగా కొనసాగుతున్న టిన్యూస్ లో హరీష్ రావుకు సంబంధించిన చిన్న వార్త కూడా ప్రసారం కాలేదు. మిగతా చానెళ్లు హరీష్ రావు వార్తలతో హోరెత్తిస్తున్నవేళ అధికారిక ఛానెల్ గా ఉన్న టిన్యూస్ లో మాత్రం హరీష్ రావు స్ర్కోలింగ్ కానీ, బొమ్మ కానీ కనిపించిన దాఖలాలు లేవు.

ఇబ్రహింపూర్ లో రాజకీయ వైరాగ్యం, భావోద్వేగంతో మాట్లాడిన మాటలపై హైదరాబాద్ కు వచ్చి మంత్రి హరీష్ రావు వివరణ ఇచ్చారు. తాను గ్రామస్థుల అభిమానం చూసి చలించిపోయి అన్నాను తప్ప మరో ఉద్దేశం లేదన్నారు.  వారు వర్షంలోనూ తడుస్తూ తనకు స్వాగతం పలికారని, వారి రుణం ఎలా తీర్చుకోవాలంటూ అలా అన్నానని వివరించారు. తనకు టిఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గిందన్న విషయంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అయితే హరీష్ రావు చేసిన ఈ ప్రకటన సైతం టి న్యూస్ లో ప్రసారానికి నోచుకోలేదు. అంతేకాదు మార్కెటింగ్ శాఖ పై హరీష్ సమీక్ష జరిపారు. ఆ సమీక్ష తాలూకు వార్తకు కూడా టిన్యూస్ లో చోటు దక్కలేదు.

నమస్తే తెలంగాణ మాదిరిగానే టిన్యూస్ కూడా హరీష్ రావుపై అప్రకటిత నిషేధం విధించాయి ఎందుకబ్బా అని జర్నలిస్టు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో టి న్యూస్ సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ చుట్టూ ఎందుకిలా జరుగుతుందో అంతుచిక్కక హరీష్ వర్గంలో కలవరం మొదలైంది.