జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శటీ, హైదరాబాద్ పరిధిలోని 13 ప్రొఫెషన్ కాలేజీలు 2019-20 నుంచి మూతపడుతున్నాయి. ఇందులో నాలుగు ఎంబిఎ కాలేజీలుంటే, మిగతావన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు. కాలేజీలను మూసేసేందుకు అనుమతినీయాలనీ ఈ కాలేజీలన్నీ విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాయి. జెఎన్ టియు దీనికి అంగీకారం తెలపనుంది. దీనితో తెలంగాణ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు దాదాపు 5వేలు తగ్గిపోతాయి.
సాంప్రదాయిక ఇంజనీరింగ్ కోర్సులు అంటే సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ వంటి కోర్సులత్ ఇంజనీరింగ్ కాలేజీలను నడప లేమని,వీటిలో చేరే వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని,అందువల్ల తమ కాలేజీలను మూసేందుకు అనుమతించాలని ఈ కాలేజీల యాజమాన్యాలు కోరాయి. ఈ కోర్సులలో చేరే వారి సంఖ్య 40 శాతం మించడంలేదు. అదే కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులలో చేరే వారి సంఖ్య 60 శాతం దాకా ఉంటున్నది.
చాలా ఇంజనీరింగ్ కాలేజీలు లెక్చరర్ల కొరత తీవ్రంగా ఉంది. అందుకే, ఒకే లెక్చరర్ ని అనేక కాలేజీలు తమ లెక్చరర్ గా చూపిస్తున్నాయి. చాలా కాలేజీల్లో సరయిన జీతాలు కూడా ఇవ్వడం లేదు. అందువల్ల ఈ కాలేజీల్లో చేరే వారి సంఖ్య పడిపోయింది. ఈ మధ్య ఎఐసిటిఇ లెక్చరర్ల నియమాకం మీద దృష్టి సారించింది. డూప్లికేషన్ లేకుండా కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంది. ప్రతికాలేజీ తమ దగ్గిర పని చేసే లెక్చరర్ల అధార్ నెంబర్ తప్పని సరిగా సమర్పించాలనే నియమం పెట్టింది. దీనితో లెక్చరర్ల డూప్లి కేషన్ కష్టమయింది. కాలేజీలు మూతపడేందుకు ఇదే కారణమంటున్నారు. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కెవికె రావ్ చెప్పిందాని ప్రకారం, రాష్ట్రంలోని 50 శాతం కాలేజీల్లో స్టాఫ్ డూప్లికేషన్ ఉంది. ఇక మనచదువులు ఎలా ఉంటాయో వూహించవచ్చు. అయితే, ఎఐసిటిఇ నియమాలు ప్రకారం రాష్ట్రంలో 50 శాతం కాలేజీలు సొంత లెక్చరర్లను నియమించుకోవాలి లేదా దుకాణం కట్టేయాలి.
ప్రస్తుతం జెఎన్ టియు-హైదరాబాద్ పరిధిలో 35 బిటెక్ కాలేజీలు, 90 ఎం టెక్ కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి మూత దరఖాస్తులు యూనివర్శిటీ పరిశీలనలో ఉన్నాయి.
ఈ కాలేజీలు మూత పడినందున పెద్ద నష్టమేమీ ఉండదని యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఎన్ యాదయ్య అంటున్నారు. ఎందుకంటే, ఇంకా అవసరానికి మించి ఇంజనీరింగ్ సీట్లున్నాయి. అందువల్ల మూసేసినందున మునిగేదేమీ ఉండదనే ఆయన వాదన.
ఇక మూసేసే బదులు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించాలని కొన్ని కాలేజీలు కోరుతున్నాయి. దానికి యాదయ్య సమాధానం ఇది. ‘ పోయిన సంవత్సరం ఒక కాలేజీలో ఆర్టిఫిషన్ ఇంటెలిజెన్స్ కోర్సు ప్రారంభించేందుకు అనుమతినిచ్చాం. అయితే ఏ మాత్రం స్పందన లేదు విద్యార్థుల నుంచి . ఎందుకంటే, ఈ కోర్సును బోధించేందుకు అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఎక్కడున్నారు. అందువల్ల ఫ్యాకల్టీ లేకుండా కొత్త కోర్సులు అనుమతించినా ప్రయోజనం ఉండదు.’