YCP Mark Politics : చిరంజీవి ఇంట్లోకి దూరిన వైసీపీ రాజకీయం.!

YCP Mark Politics

YCP Mark Politics : పవన్ కళ్యాణ్‌ని చిరంజీవి దంపతులు ఎలా పెంచారు.? చిరంజీవి ఇంట్లో పవన్ కళ్యాణ్ ఎలా పెరిగాడు.? ఈ విషయాలపై వైసీపీకి చెందిన కొందరు నేతలు, అందునా మంత్రులు మాట్లాడుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

రాజకీయం అంటేనే ఇంత.. అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసమే వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారా.? లేదంటే, అధినేత ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందా.? ఏమోగానీ, వైసీపీ రాను రాను తన ఇమేజ్ తానే చెడగొట్టుకుంటోందని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్రమత్తమవకపోతే, ఈ రాజకీయం.. వైసీపీని దారుణంగా దెబ్బతీయనుందన్నది నిర్వివాదాంశం.

‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సొంత ఎజెండా వుంటే వుండొచ్చు. ఈ రోజుల్లో కాదేదీ రాజకీయానికి అనర్హం. ఆ సినిమా గురించి వైసీపీ నేతలు ఎంత ఎక్కువ మాట్లాడితే, ఆ సినిమాకి అంత అదనంగా వసూళ్ళు వచ్చి పడతాయి. ఓ కోణంలో చూస్తే, ‘భీమ్లానాయక్’ సినిమాకి వైసీపీ నేతలంతా కలిసి ఉచిత పబ్లిసిటీ ఇస్తున్నట్లే లెక్క.

మంత్రి కొడాలి నాని తాజాగా చిరంజీవినీ, పవన్ కళ్యాణ్‌నీ వేర్వేరుగా చూసే ప్రయత్నంచేశారు. పవన్ కళ్యాణ్‌కి చిరంజీవి విషయమై సుద్దులు చెప్పేందుకు ప్రయత్నించారు. కొడాలి మాటల్ని విని చిరంజీవికి పవన్ కళ్యాణ్ దూరమవుతారా.? నాన్సెన్స్.

పైగా, ఈ చర్యలు మెగా అభిమానుల్లో ఏమన్నా ‘మెగా’, ‘పవర్’ అనే బేధాలుంటే.. అవన్నీ సమసిపోయి, అంతా ఒక్కతాటిపైకి వచ్చేందుకు దోహదపడతాయి. అదే సమయంలో, వైసీపీకి ఇవన్నీ నెగెటివ్ పాయింట్స్ అవుతాయి. వైసీపీని అభిమానించేవారికీ, మంత్రుల వ్యాఖ్యలు ఏవగింపు కలిగిస్తున్నాయి.